Mirror Neurons
మనిషి మెదడులో కొన్ని కోట్ల కణాలుంటాయి. వాటినే న్యూరాన్స్ అని పిలుస్తారు. అయితే అందులో మిర్రర్ న్యూరాన్స్ అనేవి చాలా అంటే చాలా ప్రత్యేకమయినవి. పేరులో ఉన్నట్లుగానే ఇవొక అద్దంలా పనిచేస్తాయి. సాధారణంగా మనం ఏదైనా పని చేసినప్పుడు మన మెదడులోని కణాలు స్పందిస్తుంటాయి.
కానీ, ఈ మిర్రర్ న్యూరాన్స్(Mirror Neurons) ఏం చేస్తాయంటే.. మనం ఏ పని చేయకపోయినా కూడా.. ఎదుటివారు ఒక పని చేస్తుంటే అది చూసి మన మెదడులో కణాలు అలాగే స్పందిస్తాయి. అంటే ఎదుటివారు చేస్తున్న పనిని మన మెదడు మనకు కూడా తెలియకుండానే లోపల అనుకరిస్తుందన్నమాట. అందుకే వీటిని ప్రతిబింబ కణాలని కూడా పిలుస్తారు.
నిజానికి ఈ మిర్రర్ న్యూరాన్స్ వల్లే మనకు ఎదుటవారిపై సానుభూతి (Empathy) కలుగుతుంది. ఉదాహరణకు, ఎవరైనా దెబ్బ తగిలి బాధపడుతుంటే.. అది చూసినప్పుడు మనం ఏదో తెలియని నొప్పిని ఫీలవడం, అలాగే వారితో పాటు బాధ పడటం చేస్తుంటాం.
అంతెందుకు చివరకు ఎవరైనా ఆవలింత తీసినా కూడా మనకు ఆవలింత వచ్చేస్తుంది. అలాగే ఎదుటివారు నవ్వుతుంటే మనకు తెలీకుండానే నవ్వు వస్తుంది. ఇదంతా మన మెదడులో ఉండే మిర్రర్ న్యూరాన్స్ చేసే మాయాజాలమేనట. ఎదుటివారి కళ్లల్లోని భావాలను, వారి శరీర కదలికలను చూసి వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా మన మెదడు వెంటనే గుర్తుపడుతుంది. అందుకే మనం ఇతరుల బాధను, సంతోషాన్ని కూడా మన సొంతంలా ఫీల్ అవుతూ ఉంటాం.
అయితే మనుషుల మధ్య సంబంధాలు స్ట్రాంగ్ అవడానికి ఈ మిర్రర్ న్యూరాన్స్ చాలా అవసరం. ఒకప్పుడు భాష రాకముందు మనుషులంతా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సైగలు నేర్చుకోవడానికి ఈ మిర్రర్ న్యూరాన్లే సహాయపడ్డాయని అధ్యయనాలు తేల్చాయి.
తమ తల్లిదండ్రులను చూసి పిల్లలు నడక, మాటలు, పనులు నేర్చుకోవడం వంటి పనుల వెనుక కూడా ఈ కణాల పనితీరు ఉంటుందట. ఒక రకంగా చెప్పాలంటే, సొసైటీలో మనం ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి, ఇతరుల కష్టాన్ని చూసి రియాక్టవడానికి ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఈ మిర్రర్ న్యూరాన్స్.
అందుకే ఇవి సరిగ్గా పనిచేయకపోతే మనుషులకు ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మిర్రర్ న్యూరాన్స్ మనల్ని మంచి వైపు ఎలా నడిపిస్తాయో కూడా అంతా తెలుసుకోవాలి.
ఎలా అంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మధ్య ఉంటే, మన మిర్రర్ న్యూరాన్స్ (Mirror Neurons) వారి సంతోషాన్ని మన మెదడుకు చేరవేస్తుంటాయి. అందుకే మంచి స్నేహితులు, ఉత్సాహంగా ఉండేవారి చుట్టూ సాధ్యమయినంత వరకూ ఉండటం వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.
అలాగే ఎదుటివారిని చూసి నేర్చుకునే గుణంతో పాటు ఇతరుల పట్ల దయ చూపించడం వంటివన్నీ ఈ చిన్న కణాల వల్లే సాధ్యమవుతాయి. మొత్తంగా చెప్పాలంటే మన మెదడులో జరిగే ఈ ప్రక్రియ వల్లే.. మనుషులంతా ఒకరితో ఒకరు మానసికంగా ముడిపడి ఉన్నారని చెప్పొచ్చు.
Budget : తెలంగాణ బడ్జెట్ .. సామాజిక న్యాయమే లక్ష్యంగా కేటాయింపులు జరిగాయా?
