Analog Culture: ఏంటీ అనలాగ్ కల్చర్? ఈ జనరేషన్‌ను ఎందుకు ఆకట్టుకుంటోంది?

Analog Culture: డిజిటల్ ప్రపంచంలో అన్నీ వేగంగా, క్షణాల్లో జరిగిపోతాయి. కానీ అనలాగ్ ప్రపంచం మనిషికి ఓపికను నేర్పుతుంది.

Analog Culture

ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనందరి జీవితాలను శాసిస్తున్నాయి.కానీ, విచిత్రంగా ఇప్పుడున్న యువత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మళ్లీ పాత కాలం నాటి అలవాట్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. దాన్నే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనలాగ్ కల్చర్ (Analog Culture) లేదా రెట్రో ట్రెండ్ అని పిలుస్తున్నారు.

స్క్రీన్లు లేని, చేత్తో తాకగలిగే పాత తరం వస్తువులను, అప్పటి అలవాట్లను మళ్లీ ఇప్పటి మోడర్న్ జీవితంలోకి తెచ్చుకోవడమే ఈ అనలాగ్ కల్చర్. ఉదాహరణకు, స్మార్ట్‌ఫోన్లలో వందలాది ఫోటోలు తీసుకునే అవకాశం కళ్ల ముందు ఉన్నా.. పాత కాలం నాటి ఫిలిం కెమెరాలు, ఇన్‌స్టంట్ పోలరాయిడ్ కెమెరాలను వాడటం అనలాగ్ కల్చర్ అన్నమాట.

అలాగే స్పాటిఫై, యూట్యూబ్‌లలో వేలాది పాటలు వినే అవకాశం ఉన్నా.. పాత వినైల్ రికార్డులు (గ్రామఫోన్ రికార్డులు), ఆడియో క్యాసెట్లను కొనుక్కోవడం. మాట్లాడటం కోసం వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్ చాటింగ్స్ కాకుండా చేత్తో ఉత్తరాలు రాయడం లేదా డైరీలు, జర్నల్స్ మెయింటైన్ చేయడం.. కిండిల్ లాంటి స్క్రీన్లలో స్టోరీలు చదవకుండా పుస్తకాలను చేత్తో పట్టుకుని చదవడం.. స్మార్ట్ వాచ్‌లను పక్కనబెట్టి పాత మెకానికల్ వాచ్‌లను ధరించడం.. ఇలాంటివన్నీ అనలాగ్ కల్చర్ కిందికే వస్తాయి.

ఈ డిజిటల్ యుగంలో ఈ పాత ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవ్వడానికి కొన్ని ముఖ్యమైన మానసిక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందులో మొదటిది డిజిటల్ అలసట (Digital Fatigue). మార్నింగ్ లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ల్యాప్‌టాప్‌లు,మొబైల్ స్క్రీన్లు చూసి చూసి.. నేటి తరానికి విసుగు వచ్చేసింది. ఫోన్ రింగ్ టోన్‌లు , మెసేజ్‌ల సౌండ్లు, రీల్స్ మనిషిని బాగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీని నుంచి కాసేపు బ్రేక్ తీసుకోవడానికి(Digital Detox) యూత్ ఈ అనలాగ్ మార్గాన్ని సెలక్ట్ చేసుకుంటోంది.

ఇక రెండో కారణం చూస్తే..నోస్టాల్జియా (Nostalgia) అంటే పాత జ్ఞాపకాలపై మోజు. తాము పుట్టకముందు కానీ తమ చిన్నతనంలో కానీ ఆ పాత ప్రపంచం ఎలా ఉండేదో రుచి చూడాలనే కుతూహలం ఈ జనరేషన్‌లో పెరిగింది. డిజిటల్ వస్తువులలో ఎలాంటి స్పర్శను ఫీలవలేము. అంటే ఒక ఫోటోను స్క్రీన్‌పైన చూసేదానికంటే, దాన్ని చేత్తో పట్టుకుని చూసినప్పుడు కలిగే అనుభూతి, ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది.

ఆ నిజమైన అనుభూతి కోసమే జనాలు పాత వస్తువులను ఇష్టపడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వంద ఫోటోలు పెట్టి లైకుల కోసం వెతకడం కంటే, ఒకే ఒక్క ఫిలిం ఫోటో తీసి దాన్ని దాచుకోవడంలోనే కిక్కు బాగుంటుందని భావిస్తున్నారు.

అనలాగ్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడం వల్ల మన మానసిక స్థితికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఫోకస్ (ఏకాగ్రత)ను విపరీతంగా పెంచుతుంది. ఒక కాగితం పుస్తకం చదువుతున్నప్పుడో, లేదా చేత్తో డైరీ రాస్తున్నప్పుడో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల మెదడు ప్రశాంతంగా మారి, చేసే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాం.

అలాగే ఇది మానసిక ఒత్తిడిని, యాంగ్జైటీని బాగా తగ్గిస్తుంది. రాత్రి పూట స్క్రీన్లు చూడటం బదులు పుస్తకాలు చదవడం లేదా వినైల్ రికార్డులపై పాటలు వినడం వల్ల నిద్ర చాలా బాగా పడుతుంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ వేగంగా, క్షణాల్లో జరిగిపోతాయి. కానీ అనలాగ్ ప్రపంచం మనిషికి ఓపికను నేర్పుతుంది.

Analog Culture

ఒక ఫిలిం కెమెరాలో ఫోటో తీశాక అది ప్రింట్ అయ్యి.. మన చేతికి వచ్చే వరకు ఆగడంలోనే ఒక తెలీని సంతోషం, ఓపిక అలవాటు అవుతాయి. లైఫ్ స్టైల్‌ను ఆత్రుతగా కాకుండా, ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఈ కల్చర్ ఎంతో సహాయపడుతుంది.

అనలాగ్ కల్చర్ (Analog Culture) అంటే టెక్నాలజీని పూర్తిగా వదిలేయమని చెప్పడం కాదు. టెక్నాలజీ ఇస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను వాడుకుంటూనే.. మనశ్శాంతి కోసం, ఆప్యాయతలను ఫీల్ అవ్వడం కోసం కాసేపు డిజిటల్ ప్రపంచానికి దూరంగా జరిగి పాత కాలపు ప్రశాంతతను ఆస్వాదించడం అన్నమాట. అందుకే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మైండ్ రీఛార్జ్ అవ్వడానికి ఇదొక బెస్ట్ థెరపీ వంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదంటున్నారు ఇది అనుభవించినవాళ్లు.

Ebola Virus : మరోసారి లాక్ డౌన్ తప్పదా ?..ఆఫ్రికాలో ఎబోలా మరణ మృదంగ

Exit mobile version