Gaslighting
మనం ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకున్నా సరే, ఎదుటి వ్యక్తి అది ఎప్పుడూ జరగలేదో , అది మన భ్రమ అనో పదే పదే వాదిస్తుంటే మన మీద మనకే అనుమానం వస్తుంది. దీన్నే సైకాలజీలో గ్యాస్ లైటింగ్(Gaslighting) అంటారు. అయితే ఇది చాలా డేంజర్ అని అలాగే ఒక వ్యక్తిని మానసిక బానిసగా మార్చేసే ప్రమాదకరమైన పద్ధతి అని సైకాలజీ చెబుతోంది.
తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అలాగే ఎదుటివారిని తమ అదుపులో ఉంచుకోవడానికి కొంతమంది ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. సాధారణంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య, ఆఫీసులో బాస్ కానీ, తోటి ఉద్యోగుల మధ్య కానీ అంతెందుకు, చివరికి స్నేహితుల మధ్య కూడా ఇది జరుగుతుంటుంది. అబద్ధాన్ని నిజం చేయడం, మన జ్ఞాపకశక్తిని తక్కువ చేసి మాట్లాడటం వీరి ప్రధాన లక్షణం.
ఇలాంటి మానసిక దాడికి తరచూ గురైన వారు మెల్లమెల్లగా తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక రకమైన గందరగోళంలో ఉంటూ, చివరకు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఇతరుల మీద ఆధారపడతారు.
అయితే దీని నుంచి బయటపడాలంటే ఎదుటివారి మాటలను నమ్మడం కంటే ముందు.. ముందుగా మన మీద మనకు నమ్మకం ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. మనకు గుర్తున్న విషయాలన్నిటిని ఎప్పటికప్పుడు డైరీలో రాసి పెట్టుకోవడం, అలాగే ముఖ్యమైన విషయాలను ఫోటోల రూపంలోనో, కంప్యూటర్, ఫోన్ వంటివాటిలో భద్రపరచుకోవడం వల్ల మన జ్ఞాపకశక్తిపై మనకు క్లారిటీ ఉంటుంది.
గ్యాస్ లైటింగ్ చేసే వ్యక్తులతో వాదనకు దిగడం వల్ల ఎవరికీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వారు నిజాన్ని ఎప్పటికీ ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు.అందుకే పరిస్థితిని గమనించి మనమే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
మనకు నమ్మకమైన స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో ఇలాంటి విషయాలను పంచుకున్నప్పుడు, అసలు తప్పు ఎక్కడ జరిగిందనేది మనకు అర్థమవుతుంది. ఆఫీసులో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి.. వాటి ఆధారాలను మెయిల్స్ రూపంలో భద్రపరచుకోవడం మంచిది.
మనమీద మనకు నమ్మకం సన్నగిల్లుతున్నప్పుడు అవసరమైతే మానసిక నిపుణుల సలహాలను తీసుకోవడంలో వెనకడుగు వేయకూడదు. ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మన లోపం కాదు, అది వారి ప్రవర్తనలోని సమస్య అని గ్రహించాలి. అందుకే మన మనసు చెప్పే మాటపై నమ్మకం ఉంచి, ఆత్మగౌరవంతో ముందుకు సాగడమే దీనికి సరైన సొల్యూషన్ అని తెలుసుకోవాలి.
Ustaad Bhagat Singh:ఉస్తాద్‌కు అడ్డం పడుతున్న ధురంధర్.. వీకెండ్ కింగ్ ఎవరు?
