Defensive
మన జీవితంలో కొన్నిసార్లు ఒక వింతయిన పరిస్థితిని చూస్తుంటాం. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, వారిని మనం ప్రశ్నిస్తే.. వారు పశ్చాత్తాపంగా మాట్లాడాల్సింది పోయి, తిరిగి మన మీదకే గట్టిగా ఎదురుదాడికి దిగుతారు. దీనికి నీకు సంబంధం ఏంటి?, నువ్వు మాత్రం పర్ఫెక్టా?,అయినా ఈ విషయంలో నాకేం సంబంధం లేదంటూ బుకాయిస్తారు. దీనినే సైకాలజీలో ‘డిఫెన్సివ్ మెకానిజం’ (Defensive Mechanism) అంటారని నిపుణులు చెబుతున్నారు.
అంటే, తమ బలహీనతనో, తప్పునో కప్పిపుచ్చుకోవడానికి వారు ఎంచుకునే ఒక రకమైన మానసిక కవచం అన్నమాట. తప్పు చేసిన వ్యక్తికి ఎప్పుడూ కూడా లోలోపల ఒక రకమైన భయం, గిల్టీనెస్ వేధిస్తూ ఉంటాయి. ఆ భయం బయటపడకుండా ఉండటానికే వారు కోపం, ఏడుపు అనే ముసుగును ధరించి ప్రశ్నించిన వారిపైనే ఎదురుదాడికి దిగుతారు.
నిజానికి ఇలాంటి వారు ఎదురుదాడి ఎందుకు చేస్తారంటే.. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా తనను తాను సమర్థించుకోవడానికి చూసే మొదటి మార్గం డైవర్షన్ (Diversion). అంటే చర్చను తన తప్పు నుంచి మళ్లించి, ప్రశ్నించే వ్యక్తి వైపు ఆ తప్పును ఈజీగా తిప్పడం అన్నమాట. ఎందుకంటే వారి తప్పును ఎవరైనా ఎత్తి చూపినప్పుడు, వారి అహం (Ego) దెబ్బతింటుంది.
ఆ అహాన్ని కాపాడుకోవడానికి(Defensive )అవతలి వారి కంటే కూడా గట్టిగా మాట్లాడటం మొదలుపెడతారు. అరిచి గెలవడం ద్వారా అవతలి వ్యక్తిని భయపెట్టొచ్చని, దీని ద్వారా ఆ టాపిక్ అక్కడితో క్లోజ్ అవుతుందని వారు లెక్కలేస్తారు. ఇది ఒక రకమైన మానసిక యుద్ధం. నలుగురి ముందు తాము ఓడిపోతున్నామని తెలిసినప్పుడు, తమ చివరి అస్త్రంగా గట్టిగా మాట్లాడటం అనే ఆయుధాన్ని వారు ప్రయోగిస్తారు.
ఎందుకంటే చాలామందిలో తమ తప్పును ఎదుటివారి ముందు ఒప్పుకోవడమంటే.. తమను తాము తక్కువ చేసుకోవడమే అనే భావన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇతరుల ముందు తలవంచుకోవడానికి ఇష్టపడని వారు, తమ తప్పు క్లియర్‌గా కనిపిస్తున్నా సరే బుకాయిస్తారు. దీనిని సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్ (Cognitive Dissonance) అని కూడా అంటారు.
అంటే, వారు తమను తాము మంచి వ్యక్తిగా ఫీలవుతూ ఉంటారు. కానీ వారు చేసిన తప్పు వారు అప్పటివరకూ అనుకున్న ఆ భావనకు విరుద్ధంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలో, ఆ తప్పును ఒప్పుకోవడం కంటే.. ఆ తప్పునే సమర్థించుకోవడం లేదా ఎదుటివారిని తప్పు పట్టడం వారికి సులభంగా అనిపిస్తుంది.
అలాంటి వ్యక్తులతో వాదించడం వల్ల ఫలితముండదు. ఎందుకంటే వారు నిజం వినడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండరు. కేవలం గెలవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటారు. వారు గట్టిగా అరుస్తున్నప్పుడు మనం కూడా అదే స్థాయిలో రియాక్టయితే, అది ఒక పెద్ద గొడవగా మారుతుంది తప్ప ఆ సమస్య పరిష్కారం మాత్రం కాదు. అందుకే సైలెంట్‌గా ఉండటం లేదా అక్కడి నుంచి తప్పుకోవడం వల్ల వారిలోని అపరాధ భావం ఇంకా పెరుగుతుంది. వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి మనస్సాక్షి ఎప్పుడూ వారిని ప్రశ్నిస్తుంది.
మొత్తంగా ఎవరైనా సరే తప్పును ఒప్పుకోవడమనేది గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని గ్రహించాలి. కానీ అది చాలామందికి సాధ్యం కాదు. ఎవరైనా తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారంటే.. అది వారి బలాన్ని కాదు, వారిలోని భయాన్ని, బలహీనతను సూచిస్తుందన్న విషయం అవతలివారికి ఈజీగా అర్ధం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా నిజమైన ధైర్యం తప్పు చేయకపోవడంలో లేదు, చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడంలో ఉంటుంది. నలుగురిలో అరిచి గెలిచినంత మాత్రాన అది విజయంగా అనిపించుకోదు, మనస్సాక్షిని ఒప్పించి సాధించేదే నిజమైన విజయమని తెలుసుకోవాలి.
TVK Party : విజయ్ కు షాక్ మీద షాక్…కీలక అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
