Deccan
ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే ధనవంతులకు మాత్రమే అనే అభిప్రాయం మాత్రమే ఉండేది. అయితే ఈ అభిప్రాయాన్ని చెరిపేస్తూ సామాన్యునికి విమానయాన అవకాశం కల్పించిన ఘనత కచ్చితంగా డెక్కన్ ఎయిర్ సంస్థకే దక్కుతుంది.
సామాన్యుడికి కూడా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో, దీన్ని రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ 2003 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ప్రారంభించారు. కేవలం రెండు విమానాలతో ప్రారంభమైన సంస్థ తమ నెట్ వర్క్‌ను వేగంగా విస్తరించి, 2006 నాటికి భారతదేశంలో మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది.
విమానయాన రంగంలో గోపీనాథ్‌కు ఉన్న అనుభవం, వినూత్న వ్యూహాలతో కలిసి తక్కువ సమయంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందింది. తక్కువ ఛార్జీలు, విస్తృతమైన మార్గాల నెట్‌వర్క్‌ను అందించడం, దీని ద్వారా మార్కెట్ దృష్టిని ఆకర్షించడంలో గోపీనాథ్ సక్సెస్ అయ్యారు. ముందుగా బుక్ చేసుకునే ప్రయాణికులకు కేవలం ఒక్క రూపాయికే విమాన టికెట్ అందించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ విధానం ప్రవేశపెట్టిన వెంటనే, ఊహించినట్లుగానే బుకింగ్ కౌంటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ఆశపడేవారందరూ టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరారు.
అయితే, ఇలాంటి విధానాలు విమానయాన పరిశ్రమను దెబ్బతీస్తాయని విమర్శకులు మండిపడ్డారు. ఇవేమీ పట్టించుకోకుండా గోపీనాథ్ తన లక్ష్యం దిశగా సాగతూ సంచలనం సృష్టించారు.
అంతవరకు ధనికులకు మాత్రమే పరిమితమైన విమాన ప్రయాణాన్ని మధ్యతరగతి , సాధారణ ప్రజలకు చేరువ చేసింది.పెద్ద నగరాలతో పాటు రెండవ, మూడవ శ్రేణి చిన్న పట్టణాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించింది.
అయితే ఎంత వేగంగా విస్తరించిందో అంటే వేగంగా పతనమైంది. తక్కువ ధరలకు టికెట్లు అమ్మడం వల్ల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయి పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. తక్కువ ధరల వ్యూహం, ఇంధన ధరల పెరుగుదల వల్ల నష్టాలు పెరిగాయి.
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి 2007-2008లో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో డెక్కన్(Deccan) ఎయిర్ కలపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా నష్టాలు ఏమీ తగ్గలేదు.
తర్వాత కాలంలో పునరుద్ధరించినా, 2020లో కరోనా మహమ్మారి లాక్‌డౌన్ వల్ల శాశ్వతంగా మూతపడింది. అయితే భారతీయ విమానయాన రంగంలో ఎయిర్ డెక్కన్(Deccan) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందనే విషయాన్ని మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే.
Mindset : అతి సంతోషం, అత్యంత బాధ..ఏదొచ్చినా తట్టుకోలేని మైండ్‌సెట్..మరి మీరు ఏ టైప్?
