Dharmendra Pradhan
నీట్ పేపర్ లీకేజీ వివాదంలో ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేస్తారా లేదా అన్నదే కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి ఆయన పదవి నుంచి తప్పుకోవాలని లేదంటే మంత్రివర్గం నుంచే బర్త్‌రఫ్ చేయాలని సీజేపీ, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకూ ప్రధాని నరేంద్ర మోదీ ..ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామాపై స్పందించలేదు. కానీ తాజాగా ముగిసిన కేబినెట్ సమావేశంలో దీనిపై ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులతో మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. సీజేపీ డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించకూడదని ప్రధాని, మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటే పరీక్షా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సమస్య పరిష్కారానికి ఆయన కొనసాగుతారని వర్గాలు తెలిపాయి.
కాగా ప్రతిపక్షాల ఒత్తిడి ఉన్నా కూడా, ఎన్టీఏ వ్యవస్థలో ప్రక్షాళనపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. సమస్య వచ్చినప్పుడు రాజీనామా పేరుతో తప్పించుకోవడం కంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోని లోపాలను సరిదిద్దడం ,పేపర్ లీకేజీలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంపైనే దృష్టి పెట్టింది. అలాగే ఒత్తిళ్లకు లొంగకూడదనే పాలసీనే బీజేపీ అనుసరిస్తోంది.
2015 నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు లేదా నిరసనకారుల ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రులను పదవుల నుంచి తొలగించకూడదనే స్పష్టమైన విధానాన్ని పాటిస్తోంది. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
అలాగే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ఒప్పుకుంటే, అది ప్రభుత్వం బలహీనపడిందనే సంకేతాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఇతర సీనియర్ మంత్రుల రాజీనామాల కోసం కూడా విపక్షాలు పట్టుబడతాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ కారణాలతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం ఒప్పుకోవడం లేదు.
ఇదిలా ఉంటే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం, ఒకవేళ భవిష్యత్తులో మంత్రి మార్పు తప్పనిసరి అయితే… నిరసనల ఒత్తిడితో కాకుండా, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా మాత్రమే ప్రధాని మోదీ ఈ మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే సీజేపీతో చర్చల సమయంలోనూ, వాంగ్‌చుక్ దీక్ష విరమణ సమయంలోనూ ఇతర డిమాండ్లపై మాత్రమే హామీ ఇచ్చారు.
నీట్ పేపర్ లీకేజీ ఘటన వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడానికి, ఆందోళనలు చేసిన విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను ఎత్తివేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అటు పేపర్ లీక్ ముఠాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష , రూ. కోటి వరకూ జరిమానా విధించేలా అవసరమైన బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
CJP : రాజీనామా చేయాల్సిందే..కేంద్రానికి కాక్రోచ్ పార్టీ డెడ్ లైన్
