Electric Vehicles
మన దేశంలో ఏడాది కాలంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకోవడానికి చమురు సంస్థలు మే నెలలో ఇంకా పెంచాయి. రాబోయే రోజుల్లోనూ పెట్రో ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశమే లేదని ఇప్పటికే చాలా మంది నిపుణులు తేల్చేస్తున్నారు.
అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుంటే ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) మార్కెట్ బాగా పెరిగిపోతుందని పలువురు అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టే ఆరంభంలో కాస్త దూకుడుగానే ఈవీ మార్కెట్ ముందుకు సాగింది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నా సరే కింది స్థాయి మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు.
నిజం చెప్పాలంటే కొన్ని రోజులుగా ఈవీ మార్కెట్ మందగించింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా మౌలిక వసతుల లేమి, అధిక ధరలు , ఈవీ వాహనాల(Electric Vehicles)పై వినియోగదారులకు ఉన్న సందేహాలను కారణాలుగా చెబుతున్నారు. అందుకే ఈవీ మార్కెట్ అనుకున్న స్థాయిలో విస్తరించలేకపోతోంది.
దేశంలో ఈవీలు కొనాలనుకునే వారిలో కేవలం 55 శాతం మందికి మాత్రమే సొంతంగా సురక్షితమైన హోమ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. మిగిలిన 45 శాతం ఇళ్లలో పాతబడిన వైరింగ్ ,అరకొర విద్యుత్ వ్యవస్థలతో ఈవీ లోడ్‌ను తట్టుకునే శక్తి లేదు. సరైన మౌలిక వసతులు లేక చాలామంది సాధారణ సాకెట్లు, తాత్కాలిక ఎక్స్‌టెన్షన్ వైర్లతో ఛార్జ్ చేస్తూ బ్యాటరీ నాణ్యతను దెబ్బతీస్తున్నారు.
ముఖ్యంగా అపార్ట్మెంట్లలోని పార్కింగ్ స్థలాల్లో కామన్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు, అవగాహన లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఇక సాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల ధరలు 20-30 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఈవీలలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటమే వాహనాల ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు పెరుగుతున్నా, సుదూర ప్రయాణాలు చేసే హైవేలపై వీటి లభ్యత చాలా తక్కువగా ఉంది.పెట్రోల్ కొట్టించడానికి పట్టే సమయంతో పోలిస్తే, ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా కనీసం 45-60 నిమిషాల సమయం పడుతుండటం కూడా వినియోగదారులు ఆసక్తి చూపించకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు.
అలాగే ఈవీ వాహనాల రిపేర్ల పరిష్కారానికి సంబంధించి చాలా ఇబ్బందులున్నాయి. సాంప్రదాయ మెకానిక్‌లు సాధారణ ఇంజిన్ రిపేర్లలో రాటుదేలిపోయారు. కానీ దేశంలోని 85 శాతానికి పైగా మెకానిక్‌లకు హై-వోల్టేజ్ ఈవీ బ్యాటరీలు, మోటార్లపై అవగాహన లేదు. అదే సమయంలో సర్వీస్ సెంటర్ల కొరత కూడా సమస్యగా మారింది. కేవలం 5 శాతం నుండి 10 శాతం గ్యారేజీలలో మాత్రమే ఈవీ రిపేర్లకు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
