Mamata Banerjee
కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నరీతిలో బెంగాల్ లో మమతా బెనర్జీ(Mamata Banerjee) పరాభవానికి చాలా కారణాలున్నాయి. మూడు పర్యాయాలుగా బెంగాల్ లో తన సత్తా నిరూపించుకుంటూ అధికారం చెలాయిస్తున్న మమతా బెనర్జీకి ఇది మింగుడుపడని ఓటమే. ఎందుకంటే మోదీతో ఢీ అంటే ఢీ అన్న రీతిలో చాలాసార్లు వ్యవహరించిన దీదీ ఈ సారి తన స్వీయ తప్పిదాలతోనే మూల్యం చెల్లించుకున్నారు.
ఈ ఎన్నికల్లో టీఏంసీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే ఆర్జీ కర్ హత్యాచార ఘటన ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సీఎంగా మమతా బెనర్జీ(Mamata Banerjee) వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బాధితురాలిదే తప్పు అన్న రీతిలో దీదీ మాట్లాడడం అక్కడి మహిళలు, యువతకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మృతురాలి పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా దీదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అదే సమయంలో బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలిచింది. మృతురాలి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బరిలో దింపింది. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఓటమికి మరో ప్రధాన కారణం టీఏంసీ నేతల గుండాయిజం. 15 ఏళ్లుగా అధికారంలో తామే ఉంటున్నాం…మమల్ని ఓడించేవాడు ఎవరూ లేరన్న అహంకారంతో కిందిస్థాయి టీఏంసీ నేతలు ఇష్టానుసారం వ్యవహరించారు. బలవంతపు వసూళ్లు, కొన్ని చోట్ల ప్రజలను వేధించడం వంటివి చాలానే చోటు చేసుకున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే మమతా బెనర్జీ దృష్టికి వచ్చినా వాటిపై కూడా ఆమె సరిగ్గా స్పందించలేదు. కనీసం పార్టీ శ్రేణులను హెచ్చరించనూ లేదు. దీంతో వారు మరింతగా రెచ్చిపోయారు.
అలాగే ఎన్నికలకు ముందు కీలక నేతల ఇళ్లల్లో భారీగా నగదు పట్టుబడడం కలకలం రేపింది. ఇక స్థానికులను పట్టించుకోకుండా వలసదారులను ఎక్కువగా ప్రోత్సహించిందనే అభిప్రాయం కూడా కొంపముంచింది. ముఖ్యంగా బంగ్లా నుంచి వచ్చిన చొరబాట్లను సరిగ్గా అడ్డుకోలేదు.
అదే సమయంలో ఎస్ఐఆర్ ద్వారా అక్రమ వలసదారులకు సంబంధించి దాదాపు 70 లక్షల ఓట్లను ఈసీ తొలగించడం కూడా టీఎంసీ ఓటమికి కారణమైంది. ఇదిలా ఉంటే పార్టీలో నెలకొన్న కొన్ని పరిణామాలు కూడా ప్రభావం చూపించాయి. ముఖ్యంగా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీరు టీఏంసీ కొంపముంచిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
మొదట్లో బాగానే ఉన్న అభిషేక్ క్రమంగా షాడో సీఎం మాదిరి పనిచేయడం అక్కడి నేతలకు నచ్చలేదు. సువేందు అధికారి పార్టీని వీడడానికి అభిషేక్ బెనర్జీనే కారణమన్నది బహిరంగ రహస్యం. తర్వాత పలువురు కీలక నేతలు కూడా దీదీ మేనల్లుడి వ్యవహార శైలి కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇది కూడా ఎన్నికల సమయంలో ఆ నేతలు పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేయకుండా ఉండేందుకు కారణమైందని భావిస్తున్నారు.
CSK vs DC : చెన్నైతో ఢిల్లీ బిగ్ ఫైట్..ఇరు జట్లకూ కీలక మ్యాచ్
