Mamata Banerjee
సుదీర్ఘకాలంగా బెంగాల్ ను ఏలిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) ఇటీవలి ఎన్నికలు దిమ్మతిరిగే షాకిచ్చాయి. తన ఏకఛత్రాధిపత్యం అయితేనేమి, కింది స్థాయి నేతల అవినీతి దోపిడీ అయితేనేమి, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నిరంకుశ ధోరణి అయితేనేమి ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాభవానికి కారణమయ్యాయి.
టీఎంసీ చేసిన తప్పిదాలే బీజేపీకి ఏకంగా 200కు పైగా సీట్లు వచ్చేలా చేశాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక్కడ చెప్పుకోదగిన మరో విషయం ఏమిటంటే టీఎంసీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి ప్రధాన కారణం దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీనేనని ఆ పార్టీ నేతలే చెబుతారు. శతృవులు ఎక్కడో ఉండరు… మన పక్కనే ఉంటారన్న మాటను నిజం చేస్తూ టీఏంసీ చీలిపోవడానికి కారణం అభిషేక్ బెనర్జీనేనని ఆ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి బడాస్థాయి నేత వరకూ స్పష్టం చేస్తున్నారు.
గతంలో ఈ మాట పలుసార్లు మమతా బెనర్జీ(Mamata Banerjee) వరకూ వెళ్లినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం చేజారి, పార్టీలో తీవ్ర సంక్షోభం తలెత్తిన వేళ ఎట్టకేలకు మేనల్లుడి అహంకారానికి బ్రేక్ వేస్తూ మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పలువురు నేతలు, గెలిచిన వారిలో కొందరు పార్టీని వీడారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన దీదీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
పార్టీలో తిరుగుబాటుకు ప్రధాన కారణమైన తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి షాకిచ్చారు. ఒకప్పుడు పార్టీలో తనకున్న హోదాతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ చాలా మంది కీలక నేతలు వెళ్లిపోయేందుకు కారణమైన అభిషేక్ ఇప్పుడు మరో ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులతో పని చేయాల్సి ఉంటుంది.
మమతా బెనర్జీ(Mamata Banerjee) తాజాగా తన సన్నిహిత ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్‌లను ఆ స్థానంలో నియమించింది. ఏదైనా నిర్ణయాన్ని ముగ్గురు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇక అభిషేక్ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పడినట్టే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నిర్వహించిన పార్టీ సమావేశంలో మమతా బెనర్జీ తన మేనల్లుడిని అభినందించాలని టీఎంసీ నేతలను కోరినట్టు సమాచారం.
దీంతో అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న పలువురు నేతలు దీదీ సమక్షంలోనే అభిషేక్ బెనర్జీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై దీదీ పెద్దగా స్పందించలేదు. అయితే కొందరు రెబల్ నేతలు మరోసారి అభిషేక్ బెనర్జీ తీరును ఎండగట్టారు. ఇదే విషయాన్ని మమతా బెనర్జీ దృష్టికి మిగిలిన నేతలు తీసుకెళ్లారు. పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోందని గ్రహించిన దీదీ పరిస్థితిని చక్కబెట్టే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే మేనల్లుడి నుంచి అధికారాన్ని సగం దూరం చేసి మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఈ నిర్ణయంతోనే టీఎంసీ సంక్షోభం సమసిపోయిందనుకునే పరిస్థితి లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న పలువురు అవినీతి నేతలను బయటకు సాగనంపాలని పార్టీ వర్గాలు దీదీని కోరుతున్నాయి.
Stree Ride : మహిళల సేఫ్టీ కోసం కొత్త యాప్.. స్త్రీ రైడ్ సేవలు షురూ
