Voting: ఓటు వేయకపోవడం కూడా ఒక హక్కే.. సుప్రీం కోర్టు ఎందుకిలా తీర్పు ఇచ్చింది?

Voting: ఓటు వేయని వారికి ఇచ్చే రేషన్ ఆపేయాలని కోరడం ఎంతవరకు సమంజసమని సుప్రీం కోర్టు నిలదీసింది.

Voting

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన ఆయుధం ఓటు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ ఓటును వినియోగించుకోవడమనేది పౌరుల ఇష్టమా? లేక తప్పనిసరిగా పాటించాలా అనే అంశంపై సుప్రీం కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఓటు(Voting) వేయని వారిపై చర్యలు తీసుకోవాలని, వారికి ప్రభుత్వ పథకాలను కూడా నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఓటు వేయకపోవడం కూడా ఒక హక్కేనంటూ సంచలన కామెంట్లు చేసింది. బలవంతంగా ఓటు వేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని క్లారిటీ ఇస్తూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ఈ విచారణలో పిటిషనర్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి వ్యక్తిగత కారణాల వల్లో లేక రాజకీయ పార్టీలపై నమ్మకం లేకుండానో పోలింగ్ బూత్‌కు రాకపోతే, అతడిని జైల్లో పెడతారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించింది.

ఓటు(Voting) వేయని వారికి ఇచ్చే రేషన్ ఆపేయాలని కోరడం ఎంతవరకు సమంజసమని కోర్టు నిలదీసింది. శిక్షల ద్వారా ఓటింగ్‌ను సాధించాలనుకోవడం రాజ్యాంగ విలువలకే విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఓటు వేయడమనేది పౌరుడి విచక్షణపై ఆధారపడి ఉంటుందని, దాన్ని చట్టం ద్వారా బలవంతం చేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

సుప్రీం కోర్టు తీర్పుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ప్రజలు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. ఒకవేళ ఏ పార్టీ నచ్చకపోయినా లేక నిరసన తెలపాలనుకున్నా వారు ఓటు వేయకుండా ఉండే స్వేచ్ఛ ఉండాలని వాదిస్తున్నారు.

అయితే, మేధావులు, విశ్లేషకులు మాత్రం ఓటింగ్ శాతం తగ్గితే అది బలహీనమైన ప్రభుత్వాలు ఏర్పడటానికి దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో హాలిడే మూడ్‌లో ఉండి ఓటు వేయకపోవడం వల్ల ..సరైన నాయకుడిని ఎన్నుకునే నిర్ణయం పోతోందనే అభిప్రాయం ఉంది.

సుప్రీం కోర్టు తీర్పు వల్ల భవిష్యత్తులో ఎన్నికల సంఘంపై బాధ్యత మరింత పెరగబోతోంది. శిక్షల భయం ఉండదు కాబట్టి, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించి ఓటు వేయించాలంటే ముందుగా వారిలో బాధ్యతను మేల్కొల్పాల్సి ఉంటుంది.

Voting

ఓటు వేయడం వల్ల కలిగే లాభాలను, వేయకపోతే జరిగే నష్టాలను వివరించడానికి ఎన్నికల సంఘం నడుం బిగించాలి. దీనిపై తమ ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సి ఉంటుంది.రాజకీయ పార్టీలపైన కూడా బాధ్యత పెరుగుతుంది. ఓటర్లు బూత్‌లకు రావాలంటే పార్టీలు కూడా నిజాయితీతో కూడిన మేనిఫెస్టోలను, సమర్థులైన అభ్యర్థులను రంగంలోకి దించాల్సి ఉంటుంది. అయితే ఏ అభ్యర్థి నచ్చకపోతే ఓటు వేయకుండా సైలెంట్‌గా ఉండే బదులు, నోటా బటన్ నొక్కడం ద్వారా ఓటర్లు తమ నిరసనను నమోదు చేయాలని కోర్టు అభిప్రాయపడుతోంది.

మొత్తానికి, సుప్రీం కోర్టు పౌర స్వేచ్ఛకు పెద్దపీట వేసిందనే చెప్పొచ్చు. శిక్షలతో ప్రజలను భయపెట్టాలని అనుకోవడం కంటే, చైతన్యం ద్వారా వారిని ఓటు వేయడానికి ముందుకు తీసుకువెళ్లేలా చేయడమే సరైన ప్రజాస్వామ్య పద్ధతి అని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఇటు పౌరులు కూడా ఓటును కేవలం తమ హక్కుగానే కాకుండా, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక బాధ్యతగా గుర్తించినప్పుడే ఈ తీర్పుకు పూర్తి సార్థకత దొరుకుతుంది.

Krishna : నిరాశలో ఉన్నారా? కృష్ణుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి..!

Exit mobile version