UPI Transfer : యూపీఐ పేమెంట్లలో ఆర్‌బీఐ కీలక మార్పులు.. ఇకపై డబ్బులు పంపితే ఆ ప్రాసెస్ తప్పదా?

UPI Transfer : రెగ్యులర్ ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే ఏ ఆటంకం లేకుండా వెంటనే పూర్తవుతాయి. కానీ మీ అకౌంట్‌ నుంచి జరిగే ఏదైనా ఒక ట్రాన్స్‌ఫర్ తేడాగా జరిగినట్లు అనిపిస్తే మాత్రం బ్యాంక్ సిస్టమ్ ఒకసారి అలర్ట్ చేస్తుంది.

UPI Transfer

ఈ రోజుల్లో చేతిలో ఉన్న మొబైల్‌ సాయంతోనే సెకన్లలో ఎవరి అకౌంట్లోకైనా డబ్బులు క్షణాల్లో వెళ్లిపోతున్నాయి. యూపీఐ, డిజిటల్ పేమెంట్లు రాకతో మన డైలీ ఎంత ఈజీగా మారిపోయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. కానీ ఇదే సమయంలో కేటుగాళ్ల కన్ను కూడా అకౌంట్లపై పడింది. నకిలీ కాల్స్, ఓటీపీ మెసెజ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, డీప్‌ఫేక్స్ వంటిని యూజ్ చేసి లక్షల రూపాయలు గుంజేస్తున్నారు.

దీంతో ఇటువంటి సైబర్ మోసాలకు గట్టిగా అడ్డుకట్ట వేయడానికి అలాగే యూజర్లకు ఇబ్బంది కలగకుండా సరికొత్త సేఫ్టీ ఫీచర్లను తీసుకురావాలని ఆర్‌బీఐతో పాటు ప్రముఖ బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి.

సాధారణంగా చేసే ప్రతి ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్ పైనా ఆంక్షలు విధిస్తే అది డైలీ యూజర్లకు చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే ప్రతి లావాదేవీకి డిలే ఆప్షన్ పెట్టకుండా, కేవలం అనుమానాస్పదంగా అనిపించే కొన్ని పేమెంట్లకు మాత్రం ప్రత్యేకంగా పరిశీలించే విధానాన్ని వర్తింపజేయాలని బ్యాంకులు ప్రతిపాదించాయి.

అంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే ఏ ఆటంకం లేకుండా వెంటనే పూర్తవుతాయి. కానీ మీ అకౌంట్‌ నుంచి జరిగే ఏదైనా ఒక ట్రాన్స్‌ఫర్ తేడాగా జరిగినట్లు అనిపిస్తే మాత్రం బ్యాంక్ సిస్టమ్ ఒకసారి అలర్ట్ చేస్తుంది.

ఈ విధానంలో భాగంగా మొబైల్ స్క్రీన్ పై ఒక స్పెషల్ పాప్-అప్ మెసేజ్ వస్తుంది. దానిలో నిజంగానే పలానా వ్యక్తికి డబ్బు పంపాలనుకుంటున్నారా అని అడుగుతూ అందులో రెండు ఆప్షన్లు (Yes / No) కనిపించేలా వస్తాయి. దానికి ‘Yes’ అని క్లిక్ చేస్తే మనీ వెంటనే ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

ఒకవేళ పొరపాటున లేదా తెలీకుండానే ట్రాన్జాక్షన్ జరుగుతున్నట్లు అన్పిస్తే No అని నొక్కితే లావాదేవీ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ మెసేజ్‌పై ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోతే, సిస్టమ్ దాన్ని ఆపి ఉంచి దాదాపు వన్ అవర్ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేస్తుంది.

దీనివల్ల మోసగాళ్ల మాయమాటలు నమ్మి తొందరపాటులో డబ్బు పంపడమూ, లేదంటే కేటుగాళ్లే ఏమార్చి మనీ పంపిస్తున్నా కూడా బాధితులకు ఆలోచించుకోవడానికి టైమ్ దొరుకుతుంది.

అయితే ఈ కొత్త రూల్ ప్రతి పేమెంట్‌కూ వర్తించదు. కేవలం కొన్ని రకాల స్పెషల్ సందర్భాల్లోనే ఈ వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. ఉదాహరణకు.. రాత్రి సమయాలలో పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం, కొత్త అకౌంట్‌కు లేదా ఈమధ్యే కొత్తగా తెరిచిన బ్యాంక్ అకౌంట్‌కు మనీ పంపడం వంటివి సిస్టమ్ గుర్తిస్తుంది.

మెయిన్‌గా 10 వేల రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఈ రూల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ లిమిట్‌ను 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు పెంచే ఆలోచన కూడా ఉంది.

నిజానికి భారత్‌లో సైబర్ నేరాలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో డేటా చూస్తేనే అర్ధం అయిపోతుంది. 2021వ సంవత్సరంలో సుమారు 2.6 లక్షల మోసాల కేసులు నమోదై రూ.551 కోట్ల నష్టం జరగగా, 2025 నాటికి ఆ కేసుల సంఖ్య 2.8 లక్షలకు చేరుకుంది.

UPI Transfer

అంతేకాదు మోసపోయిన మొత్తం విలువ ఏకంగా రూ.22,931 కోట్లకు చేరడం అంటేనే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బాధితులే స్వయంగా మోసగాళ్ల మాటలు నమ్మి మనీ పంపడాన్ని టెక్నికల్‌గా ..అధీకృత పుష్ పేమెంట్ (APP) ఫ్రాడ్ అని పిలుస్తారు.

కాగ చిరు వ్యాపారులు, కిరాణా షాపుల వాళ్లు కూడా కస్టమర్ల నుంచి క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. అటువంటపుడు ఓవర్ సెక్యూరిటీ వల్ల డిజిటల్ చెల్లింపుల స్పీడ్ తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనలన్నింటిని కూడా పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

AirPods With Camera : ఆపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. చెవులకు కెమెరాలు పెడుతున్న ఆపిల్..

Exit mobile version