Vijay Mallya : భారత్‌కు ఝలక్ లండన్‌లో రాయల్ లైఫ్.. విజయ్ మాల్యా బిజినెస్ సామ్రాజ్యాన్ని ముంచేసిన ఆ ఒక్క తప్పు ఏంటి?

Vijay Mallya : మనీల్యాండరింగ్, మోసం కేసుల వల్ల అరెస్ట్ అవుతారనే భయంతో విజయ్ మాల్యా 2016 మార్చిలో భారతదేశం నుంచి లండన్ పారిపోయారు.

Vijay Mallya

భారతీయ వ్యాపార వేత్తల్లో అత్యంత విలాసవంతంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విజయ్ మాల్యా. ఒకప్పుడు భారతదేశంలో కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్‌గా పిలవబడిన విజయ్ మాల్యా, లగ్జరీ జీవితానికి వ్యాపార సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు.మద్యం వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధించినా.. విమానయాన రంగంలోకి అడుగుపెట్టడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. విజయ్ మాల్యా పతనానికి ప్రధాన కారణం ఆయన స్థాపించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విఫలమవడమే అని చెప్పాలి. దాని కోసం చేసిన వేల కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించలేకపోవడంతోనే ఆయన పతనం ప్రారంభం అయింది.

ఏకంగా పది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా(Vijay Mallya).. వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యానికి కారణం అధిక నిర్వహణ ఖర్చులని చెప్పొచ్చు. 2005లో ప్రారంభమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను మాల్యా అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. అయితే, అంతర్జాతీయంగా పెరిగిన విమాన ఇంధన ధరలు, భారీ నిర్వహణ ఖర్చులు సంస్థకు పెద్ద నష్టాలను తెచ్చిపెట్టాయి.

అప్పటికే నష్టాల్లో ఉన్న ఎయిర్ డెక్కన్ సంస్థను కొనుగోలు చేయడం కింగ్‌ఫిషర్ పాలిట అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఇది సంస్థపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. విమానయాన సంస్థను కాపాడుకోవడానికి మాల్యా తన పాపులారిటీ ఉపయోగించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 భారతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి సుమారు 10 వేల కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నారు.

నష్టాలు తీవ్రం కావడంతో, 2012లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో 2015లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయనను డిఫాల్టర్ గా ప్రకటించింది.

Vijay Mallya

తర్వాత మనీల్యాండరింగ్, మోసం కేసుల వల్ల అరెస్ట్ అవుతారనే భయంతో విజయ్ మాల్యా 2016 మార్చిలో భారతదేశం నుంచి లండన్ పారిపోయారు. లండన్‌కు సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో గల తన విలాసవంతమైన లేడీవాక్ కంట్రీ ఎస్టేట్‌లో విజయ్ మాల్యా రాయల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

భారత ప్రభుత్వం విజయ్ మాల్యా(Vijay Mallya)ను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. బ్యాంకులు మాల్యాకు చెందిన వేల కోట్ల విలువైన షేర్లు, స్థిర ఆస్తులను జప్తు చేసి, వేలం ద్వారా రికవరీ చేసుకున్నాయి. ప్రస్తుతం లండన్ ప్రభుత్వం ఆయనను భారతదేశానికి అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయి.

Gold Price : గోల్డ్, సిల్వర్ రేట్లకు బ్రేక్.. ఈరోజు వీటి ధరలు ఎలా ఉన్నాయి?

Exit mobile version