CSK vs DC : చెన్నై గెలుపు ఖాతా తెరిచేనా ?…చెపాక్ వేదికగా ఢిల్లీతో పోరు

CSK vs DC : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది

CSK vs DC

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టు తొలి విజయాన్ని రుచి చూడలేదు. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క ఆటగాడు రాణించడం లేదు.

ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న సంజూ శాంసన్ ఫ్లాప్ అవుతున్నాడు. మూడు మ్యాచ్ లలోనూ నిరాశపరిచిన సంజూ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్(CSK vs DC) తో జరిగే మ్యాచ్ లోనైనా రాణిస్తాడేమో చూడాలి. ధోనీ లేకపోవడం కూడా చెన్నైకి ఇబ్బందిగా మారింది. అయితే గాయంతో గత మూడు మ్యాచ్ లకూ దూరమైన బ్రెవిస్ జట్టులోకి తిరిగి రావడం చెన్నైకి ఊరటగా చెప్పొచ్చు.

ఎందుకంటే సీఎస్కే బ్యాటింగ్ లైనప్ లో సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమవుతున్నారు. చెన్నై బ్యాటింగ్ గాడిన పడితే తప్ప తొలి విజయం అందడం కష్టమే. బౌలింగ్ పరంగానూ సీఎస్కే ఒత్తిడిలో ఉంది. ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ , నూర్ అహ్మద్ లాంటి వారున్నా స్థాయికి తగినట్టు రాణించడం లేదు. హోం గ్రౌండ్ లో చెన్నై బౌలర్లు పుంజుకుంటారేమో చూడాలి.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు గత మ్యాచ్ లో బ్రేక్ పడింది. దాదాపు గెలిచిందనుకున్న మ్యాచ్ లో గుజరాత్ పై 1 పరుగు తేడాతో ఓడిపోయింది. మళ్లీ గెలుపు బాట పట్టాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్, నిస్సాంక, మిల్లర్ రాణిస్తుండగా.. సమీర్ రిజ్వీ తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు.

CSK vs DC

ఢిల్లీ గెలిచిన రెండు మ్యాచ్ లలో రిజ్వీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్ అందుకుంటే తిరుగుండదు. బౌలింగ్ పరంగా ఢిల్లీ రాణిస్తోంది. నటరాజన్, ముకేశ్ కుమార్, ఎంగిడి సత్తా చాటుతున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అడ్వాంటేజ్.

ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 మ్యాచ్ లలో తలపడితే 19 సార్లు చెన్నై విజయం సాధించింది. 12 మ్యాచ్ లలో ఢిల్లీ గెలిచింది. ఇక చెపాక్ స్టేడియం పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్ పై భారీస్కోర్లు నమోదవడం ఖాయం.

SRH vs PBKS : సన్ రైజర్స్ పుంజుకుంటుందా ?…పంజాబ్ కింగ్స్ తో కీ ఫైట్

Exit mobile version