CSK vs PBKS
ఐపీఎల్ 19వ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు సొంతగడ్డపై మ్యాచ్ కు రెడీ అయింది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్(CSK vs PBKS) ను ఢీకొంటుంది. గత సీజన్ వైఫల్యాన్ని కొనసాగిస్తూ తొలి మ్యాచ్ లో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. ధోనీ కండరాల నొప్పితో కొన్ని మ్యాచ్ లకు దూరమవడం కూడా చెన్నైకి మైనస్ గా మారింది.
ట్రేడింగ్ లో సీఎస్కేకు వచ్చిన సంజూ శాంసన్ తొలి మ్యాచ్ లో నిరాశపరిచాడు. సంజూ భారీ ఇన్నింగ్స్ ఆడాలని చెన్నై ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది. వీరిద్దరూ మెరుపు ఆరంభాన్నిస్తే భారీస్కోరుపై ఆశలు పెట్టుకోవచ్చు. తర్వాతి బ్యాటింగ్ ఆర్డర్ లో ఆయుష్ మాత్రే, బ్రెవిస్ పై భారీ అంచనాలున్నాయి.
గత మ్యాచ్ లో గాయం కారణంగా ఆడని మాత్రే జట్టులోకి తిరిగి రానుండడం చెన్నై బలాన్ని పెంచేదే. అలాగే ఫినిషర్ శివమ్ దూబే చెలరేగితే చెన్నై సూపర్ కింగ్స్(CSK vs PBKS) భారీస్కోరు చేయడం ఖాయం. ఇటీవల టీ20 ప్రపంచకప్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడిన దూబేపై సీఎస్కే ఆశలు పెట్టుకుంది. అలాగే కార్తీక్ వర్మ, ప్రశాంత్ వీర్ కూడా బ్యాట్ తో మెరుపులు మెరిపించేవారే. బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ కొత్త బంతితో చెలరేగేందుకు ఎదురుచూస్తున్నారు.
అలాగే జేమీ ఓవర్టన్ కూడా మిడిల్ ఓవర్లలో కీలకం కానున్నాడు. అటు స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్ పైనే సీఎస్కే భారం మోపింది. గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా విఫలమయ్యాడు. దీంతో బ్యాటర్లు రాణించడంపైనే చెన్నై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మరోవైపు సీజన్ ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్(CSK vs PBKS) ఫుల్ జోష్ లో ఉంది. గత మ్యాచ్ లో ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య సరైన ఆరంభాన్నివ్వలేకపోయారు. కూపర్ కన్నోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్ కు శ్రేయాస్ అయ్యర్, వధేరా, స్టోయినిస్, శశాంక్ సింగ్ లాంటి హిట్టర్ల బలముంది.
అటు పేస్ బౌలింగ్ లో బార్ట్ లెట్ , మార్కో యెన్సన్ , అర్షదీప్ సింగ్ ఉన్నారు. వీరిలో అర్షదీప్ గాడిన పడాల్సి ఉంది. స్పిన్ విభాగంలో చాహల్ పంజాబ్ కింగ్స్ కు ప్రధాన బలం. ఐపీఎల్ చరిత్రలో మంచి అనుభవమున్న చాహల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం కలిసొస్తుంది.
గత రికార్డులను చూస్తే ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకూ 32 సార్లు తలపడితే పంజాబ్ కింగ్స్ 16, చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచ్ లు గెలిచాయి. అటు పిచ్ విషయానికొస్తే సాధారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఐపీఎల్ కావడంతో బ్యాటర్లకు కూడా సపోర్ట్ దక్కుతుంది. దీంతో భారీస్కోర్లు నమోదవ్వొచ్చు.
