IND vs ENG :భారత్ నిలుస్తుందా ? ..ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20

IND vs ENG : సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో భారత్ పుంజుకుంటుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

IND vs ENG

వరల్డ్ ఛాంపియన్.. పొట్టి క్రికెట్ లో నెం.1… కొన్ని నెలలుగా తిరుగులేని రికార్డు… కానీ ఇంగ్లాండ్ గడ్డపై భారత టీ20 జట్టు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అంతకుముందే ఐర్లాండ్ చేతిలో ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపైనా పేలవ ప్రదర్శనతో వెనుకబడిపోయింది. మరి సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో భారత్(IND vs ENG) పుంజుకుంటుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లాండ్‌లో టీమిండియా(IND vs ENG) ఇంత పేలవంగా ఆడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. రెండో టీ20లో కొంచెం మెరుగ్గానే ఆడినా మూడో మ్యాచ్‌లో మాత్రం దారుణ ఓటమిని మూటగట్టుకుంది. కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ నుంచి శివమ్ దూబే వరకూ ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో నిలవలేకపోయారు. అంచనాలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీతో సహా కీలక బ్యాటర్లంతా చేతులెత్తేశారు.

బ్యాటర్లు గాడిన పడితే తప్ప భారత్ ఈ సిరీస్‌లో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. బ్రిస్టల్ వేదికగా జరగబోయే నాలుగో టీ ట్వంటీ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మను కొనసాగిస్తారా లేక చివరి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ తిలక్‌ను తప్పిస్తే అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని, వన్‌డౌన్‌లో ఆడించే ఛాన్స్ ఉంది.

సంజూ శాంసన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లకు తప్పించడంపై అటు మాజీలు, ఇటు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.

అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ , శివమ్ దూబే మెరుపులు మెరిపించాల్సి ఉంది. అటు బౌలింగ్‌లోనూ భారత్ మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తోంది. స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోతున్నారు. ప్రిన్స్ యాదవ్ , హర్షిత్ రాణా రాణిస్తుండగా మిగిలిన బౌలర్ల నుంచి సపోర్ట్ రావాల్సి ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టడి చేయకపోతే ఇబ్బందులు తప్పవు.

IND vs ENG

మరోవైపు వరుసగా రెండు విజయాలతో 2-0 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. బ్యాటింగ్‌లో సాల్ట్, బట్లర్ ఫామ్‌లో ఉండగా సామ్ కుర్రాన్ కూడా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో ఆర్చర్, టంగ్ అదరగొడుతున్నారు. వీరి పేస్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక బ్రిస్టల్ గ్రౌండ్‌లోనూ భారత్‌కు మంచి రికార్డే ఉంది. సహజంగానే బ్రిస్టల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండడంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.

Yamaha Aerox : సింగిల్ ఛార్జ్‌పై 117 కిలోమీటర్ల మైలేజ్..రిమూవబుల్ బ్యాటరీతో యమహా స్కూటీ ఫీచర్ అదుర్స్..

Exit mobile version