MI vs RR
ఐపీఎల్ 19వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ సీజన్ ను అద్భుతంగా ప్రారంభించిన రాజస్థాన్ వరుసగా రెండు విజయాలతో అదరగొట్టింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసిన రాజస్థాన్ తర్వాతి మ్యాచ్ లో గుజరాత్ పై గెలిచింది. అహ్మదాబాద్ లో ఓడిపోయే మ్యాచ్ లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆర్చర్, తుషార్ దేశ్ పాండే అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ ను నిలువరించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ తో తలపడనున్న రాయల్స్(MI vs RR) హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లాలని భావిస్తోంది. రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ , వన్ డౌన్ బ్యాటర్ ధృవ్ జురెల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.
ముఖ్యంగా సూర్యవంశీ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ దుమ్మురేపుతున్నాడు. బౌలర్ ఎవరైనా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. మంగళవారం నాటి మ్యాచ్ లో ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు, ముంబై స్టార్ పేసర్ బుమ్రాను ఎదుర్కొనబోతున్నాడు.
అలాగే జైస్వాల్ , జురెల్ కూడా రాణిస్తున్నారు. కెప్టెన్ రియన్ పరాగ్ , హెట్ మెయిర్ కూడా చెలరేగితే రాజస్థాన్ కు తిరుగుండదు. రాయల్స్ జట్టులో జడేజా తన మార్క్ చూపించలేదు. మరోవైపు బౌలింగ్ లో ఆర్చర్, బర్గర్ పేస్ ఎటాక్ లో కీలకం కాబోతున్నారు. గత మ్యాచ్ లో ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ పై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్ లాంటి మ్యాచ్ విన్నర్ రాజస్థాన్ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. గుజరాత్ పై 4 కీలక వికెట్లతో తన స్పిన్ మ్యాజిక్ ను చూపించిన బిష్ణోయ్ ను ఎదుర్కోవడం ముంబై బ్యాటర్లకు సవాల్ గా చెప్పాలి. అతనితో పాటు సీనియర్ స్పిన్నర్ జడేజా, మరో పేసర్ సందీప్ శర్మ కూడా రాణిస్తే రాయల్స్ పై చేయి సాధించే అవకాశముంటుంది.
మరోవైపు తొలి మ్యాచ్ గెలిచి సీజన్ ను ఘనంగా ఆరంభించిన ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్ లో తేలిపోయింది. బ్యాటర్ల వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. హార్థిక్ పాండ్యా అనారోగ్యంతో దూరమవడం కూడా ఈ ఓటమికి కారణమైంది. ఇప్పుడు పాండ్యా ఫిట్ నెస్ సాధించడంతో రాజస్థాన్ పై రీఎంట్రీ ఇస్తున్నాడు.
ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ లో ఉండగా.. రికెల్టన్ పైనా అంచనాలున్నాయి. తిలక్ వర్మ ఇంకా తనదైన మార్క్ చూపించలేదు. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్ లోకి వస్తే తప్ప ముంబై గెలుపు బాట పట్టే అవకాశం లేదు.
బౌలింగ్ పరంగా బుమ్రాతో పాటు బౌల్ట్ , కార్బిన్ బోస్చ్ , శార్థూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఉండగా.. స్పిన్ విభాగంలో మిఛెల్ శాంట్నర్ పై అంచనాలున్నాయి. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గువాహటి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ పిచ్ పై పరుగులు చేయడం బ్యాటర్లకు సవాల్ గానే భావిస్తున్నారు.
గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 31 మ్యాచ్ లలో తలపడగా ముంబై 16 సార్లు గెలిస్తే , రాజస్థాన్(MI vs RR) 14 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
Chennai Super Kings : ధోనీ లేకుంటే అంతేనా ?…పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై
