MI vs RR
ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ నేటితో ముగియబోతోంది. ఇప్పటి వరకూ మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిన బెర్త్ కోసం మూడు జట్లు పోటీలో నిలిచాయి. ఈ రేసులో అందరికంటే ముందున్న రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్(MI vs RR) తో కీలక పోరుకు సిద్ధమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్త్ వారి చేతుల్లోనే ఉంది.
ముంబైని ఓడిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం పంజాబ్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఉంటుంది. అయితే ఆ జట్ల కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడం రాజస్థాన్ కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం రాజస్థాన్ కు ఉత్సాహాన్నిచ్చింది. ఈ గెలుపుతోనే ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచింది. లక్నో భారీస్కోరు చేసినా రాయల్స్ అలవోకగా ఛేదించింది.
దీనికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీనే. ఈ చిచ్చర పిడుగు తన సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. జైస్వాల్ తో కలిసి అద్భుతమైన ఆరంభాలనిస్తున్నాడు. అలాగే జురెల్, ఫెరీరా, జడేజా వంటి హిట్టర్లు చివర్లో చెలరేగితే రాజస్థాన్ కు తిరుగుండదు. అయితే గత మ్యాచ్ లో రియాన్ పరాగ్ గాయంతో దూరమవడంతో జైస్వాల్ సారథిగా వ్యవహరించాడు.
కీలకమైన ముంబైతో మ్యాచ్ కు పరాగ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి. అటు బౌలింగ్ లో ఆర్చర్, సందీప్ శర్మతో పాటు బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా కూడా రాణిస్తున్నారు. అయితే బ్యాటింగ్ కు అనుకూలించే వాంఖడే పిచ్ పై వీరంతా కలిసికట్టుగా ఎలా రాణిస్తారనేది చూడాలి.
మరోవైపు ఈ సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ పరువు కోసం పోరాడుతోంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆ జట్టు సీజన్ ను విజయంతో ముగించాలని పట్టుదలగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్ తోనే ముంబైకి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గత మ్యాచ్ లో బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో కోల్ కతా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. నిజానికి ఈ సీజన్ లో ముంబై బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. ఒకట్రెండు మ్యాచ్ లలో తప్పిస్తే అంచనాలు పెట్టుకున్న ప్లేయర్స్ ఏమాత్రం రాణించలేదు.
ఇప్పటి వరకూ 13 మ్యాచ్ లలో కేవలం నాలుగే విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. రోహిత్ శర్మ, రికెల్టన్ నిలకడలేని ఆటతీరు ఇబ్బందిగా మారింది. అటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. తిలక్ వర్మ పర్వాలేదనిపించినా కీలక సమయంలో నిరాశపరుస్తున్నాడు. బౌలింగ్ లో బుమ్రా తనపై అంచనాలు అందుకోలేకపోయాడు.
శార్దుల్ ఠాకూర్ , కార్బిన్ బోస్చ్ కూడా పెద్దగా రాణించడం లేదు. గత రికార్డులను చూస్తే ముంబైదే పైచేయిగా ఉంది. ఇక పిచ్ విషయానికొస్తే మధ్యాహ్నం మ్యాచ్ అయినాసరే బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.
Green Card : గ్రీన్ కార్డు కోసం ట్రంప్ కొత్త రూల్..అమెరికా వదలిపోవాల్సిందేనా?
