Mumbai Indians
ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) కీలక పోరుకు సిద్ధమైంది. హోంగ్రౌండ్ ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ ( Mumbai Indians)తో తలపడబోతోంది. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ అదరగొట్టింది. సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాలతో దుమ్మురేపింది. కానీ సెకండాఫ్ వచ్చేసరికి సీన్ రివర్సయింది. భారీ స్కోర్లు చేసినా ఊహించని విధంగా పరాజయాలు చవి చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్ లలో వరుసగా ఓడిపోయింది. రాజస్థాన్, గుజరాత్. సన్ రైజర్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోనూ ఓటమి పాలైంది.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. పంజాబ్ వరుస ఓటములకు బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ఫీల్డింగ్ తప్పిదాలను కూడా కారణంగా చెప్పొచ్చు. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ పంజాబ్ ఫీల్డర్లు పలు క్యాచ్ లు వదిలేస్తున్నారు.
ఫీల్డింగ్ మెరుగుపడకుంటే మాత్రం ఆ జట్టుకు ఇబ్బందులు తప్పవు. బ్యాటింగ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ , శ్రేయాస్ అయ్యర్ , స్టోయినిస్ రాణిస్తున్నారు. కూపర్ కన్నోలీ కూడా సత్తా చాటుతున్నాడు. అయితే టాపార్డర్ ఇచ్చిన ఆరంభాలను ఒక్కోసారి తర్వాతి బ్యాటర్లు కొనసాగించలేకపోతుండడంతో అనుకున్నదాని కంటే తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సి వస్తోంది. బౌలింగ్ లో మార్కో జెన్సన్ , విజయ్ కుమార్ వైశాక్ తో పాటు ఫెర్గ్యుసన్, అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. అయితే స్లాగ్ ఓవర్లలో పరుగులు ఇచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చాహల్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు.
మరోవైపు పేలవ ప్రదర్శనతో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) ఇప్పటికే నిష్క్రమించింది. రికెల్టన్ నిరాశ పరుస్తుండగా.. రోహిత్ శర్మ, నమన్ ధీర్ రాణిస్తున్నారు. గత మ్యాచ్ లో బెంగళూరుపై తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక్క మ్యాచ్ లోనూ సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
అటు మిగిలిన బ్యాటర్ల విషయానికొస్తే విల్ జాక్స్ అవకాశాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. బౌలింగ్ లోనూ ముంబై ఈసారి పూర్తిగా నిరాశపరిచింది. స్టార్ పేసర్ బుమ్రా సైతం పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్లు తీయడం మరిచిపోయినట్టుగా బుమ్రా బౌలింగ్ ఉంది. మిగిలిన బౌలర్లలో శార్థూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కార్బిన్ బోస్చ్ రాణిస్తున్నారు. గత రికార్డులను చూస్తే రెండు జట్ల మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ రెండు జట్లు 35 మ్యాచ్ లలో తలపడితే పంజాబ్(Punjab Kings) 18 సార్లు, ముంబై 17 సార్లు గెలిచాయి.
