Rajasthan Royals
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్ పడడానికి గంట ముందు నుంచే గువాహటిలో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యమవుతూ వచ్చింది. వర్షం తగ్గిన తర్వాత 11 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచడమే లక్ష్యంగా ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేశారు.
తొలి బంతులనే ఇద్దరూ సిక్సర్లు బాదేశారు. అది కూడా బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ను పిచ్చకొట్టుడు కొట్టారంటే వారిద్దరూ ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యగా సూర్యవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా బౌలింగ్ లో ఎంతో మంది వరల్డ్ క్లాస్ బ్యాటర్లు తడబడిన సందర్భాలను చూసాం. కానీ వైభవ్ మాత్రం బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు బాదాడు. ఏ మాత్రం భయం లేకుండా అతను బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం.
బుమ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే వైభవ్ సూర్యవంశీ లాంగాన్ దిశగా సిక్సర్ తరలించాడు. అనంతరం సింగిల్ తీసుకోగా.. జైస్వాల్ మరో సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతిని కూడా లెగ్ సైడ్ సిక్సర్ బాదిన వైభవ్ సూర్యవంశీ.. తర్వాతి రెండు బాల్స్ డాట్ చేశాడు. వైభవ్ 14 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 39 పరుగులు చేయగా.. తర్వాత జైస్వాల్ మరింతగా రెచ్చిపోయాడు.
సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రియన్ పరాగ్ (20) కూడా అతనికి జత కలిసాడు. జైస్వాల్ 32 బంతుల్లో 77 ( 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఘజన్ ఫర్ 2 , శార్థూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు. జైస్వాల్, వైభవ్ దెబ్బకు ముంబై బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ముంబై కూడా సంచలన బ్యాటింగ్ చేస్తుందేమోనని అంతా అనుకున్నారు. అయితే రాజస్థాన్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. రికెల్టన్(8), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ (6) , హార్థిక్ పాండ్యా (9) పరుగులకే ఔటయ్యారు. తిలక్ వర్మ(14) కూడా నిరాశపరచడంతో ముంబై 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
తర్వాత నమన్ ధీర్ (25), రూథర్ ఫర్డ్ (25) కాసేపు మెరుపులు మెరిపించడంతో పరుగుల అంతరం మాత్రమే తగ్గింది. చివరికి ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. రాజస్థాన్(Rajasthan Royals) కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం.
Cicada : వ్యాపిస్తున్న మరో మహమ్మారి…కోవిడ్ సికాడా ప్రాణాంతకమా ?
