Cicada : వ్యాపిస్తున్న మరో మహమ్మారి…కోవిడ్ సికాడా ప్రాణాంతకమా ?
Cicada : కోవిడ్ సికాడా అనే వైరస్ ఇప్పుడు వ్యాపిస్తోంది. కోవిడ్ 19 వైరస్ లోని కొత్త సబ్ వేరియంట్ గా చెబుతున్నారు
Cicada
ఏడేళ్ల క్రితం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోయింది. చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వ్యాపించిన కోవిడ్ మహమ్మారి కారణంగా లక్షలాది మంది మృతి చెందారు. ఈ వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దాదాపు రెండు , మూడు నెలలు తీవ్రస్థాయిలో వణికించిన కరోనా నుంచి స్వీయజాగ్రత్తలతో ప్రపంచ దేశాలు కోలుకున్నాయి. తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ వచ్చినా పెద్దగా భయపడలేదు. వ్యాక్సీన్లు తీసుకున్న ప్రభావంతో పాటు మరోసారి జాగ్రత్తలు తీసుకుంటూ ఎదుర్కొన్నారు. అయితే ఈ వైరస్ మాత్రం రూపాంతరం చెందుతూ కొత్త కొత్త వేరియంట్లలో ప్రపంచదేశాలపై దాడి చేస్తోంది.
తాజాగా కోవిడ్ సికాడా అనే వైరస్ ఇప్పుడు వ్యాపిస్తోంది. కోవిడ్ 19 వైరస్ లోని కొత్త సబ్ వేరియంట్ గా చెబుతున్నారు. ఇది ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ కుటుంబంలో ఉన్న బీఏ 3.2 మ్యూటేషన్లతో రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే గత వేరియంట్లతో పోలిస్తే సికాడా పెద్దగా భయపడాల్సిన వేరియంట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సికాడా వేరియంట్‌ను గమనిస్తోంది. డబ్ల్యూహెచ్ వో వర్గాల సమాచారం ప్రకారం ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల తరహాలోనే ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే ప్రమాదకరమైనది కాదనీ, తీవ్రమైన సమస్యలకు కారణమవదని గుర్తించారు.

పాత ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉందనీ, మన రోగనిరోధకశక్తిని దాటుకుని ఇబ్బంది కలిగించే పరిస్థితి లేదని చెబుతున్నారు. అలాగే కరోనా వైరస్ తరహాలో ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేదంటున్నారు.
సికాడా(Cicada) వైరస్ సోకితే జ్వరం, జలుబు, గొంతునొప్పితో పాటు ఒంటినొప్పులు సాధారణంగా కనిపించే లక్షణాలు.
ఇవి నార్మల్ గానే వారం రోజుల్లో తగ్గిపోతాయనీ, హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు గుర్తించారు. అయితే మిగిలిన వేరియంట్లలానే చాలా త్వరగా వ్యాప్తి చెందడం ఒక్కటే కామన్ గా కనిపిస్తున్న లక్షణంగా చెబుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తుందని వైద్యులు వెల్లడించారు. ఒకవేళ సికాడా సోకినా ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదని, సాధారణ జ్వరం మాదిరిగానే దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు.





