RCB : ముగిసిన ముంబై కథ..టాప్ ప్లేస్ కు ఆర్సీబీ

RCB : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం రాయపూర్ వేదికగా జరిగిన అత్యంత ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది

RCB

ఆర్సీబీ, ముంబై మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠతో ఊపేసింది… రెండు బెస్ట్ టీమ్స్ పోటీపడితే ఎలా ఉంటుందో మరోసారి అభిమానులకు అర్థమైంది. చివరికి ఒత్తిడి జయించిన బెంగళూరు గెలిస్తే.. ముంబై కథ ముగిసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో పాటు చివర్లో సిక్సర్ కొట్టి ఆర్సీబీ(RCB)ని గెలిపించాడు.

ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా దూరమవడంతో మరోసారి సూర్యకుమార్ కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. భారీస్కోరు చేయడమే లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన ముంబైని భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ (22), రికెల్టన్ (2), సూర్యకుమార్ (0) ఔటయ్యారు. దీంతో ముంబై కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నమన్ ధీర్, తిలక్ వర్మ ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 57 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నమన్ ధీర్ చాలా రోజుల తర్వాత మెరుపులు మెరిపించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.

నమన్ ధీర్ ఔటైన తర్వాత ముంబై ఇన్నింగ్స్ ను తిలక్ వర్మ నడిపించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 రన్స్ చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. చివర్లోనూ ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కేవలం 23 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాజిల్ వుడ్, సలామ్ దార్ , షెఫర్డ్ ఒక్కో వికెట్ తీసారు.

ఛేజింగ్ లో బెంగళూరు కూడా తడబడింది. ముంబై పేసర్ కార్బిన్ బోస్చ్ , దీపక్ చహర్ చెలరేగడంతో ఆర్సీబీ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ డకౌటవగా.. పడిక్కల్ 12, పటిదార్ 8 పరుగులకే ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో కృనాల్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.

RCB

బెథెల్ తో కలిసి 55 పరుగులు జోడించాడు. బెథెల్ (27) ఔటైన తర్వాత జితేశ్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించాడు. మధ్యలో కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. జితేశ్ శర్మ (18) , టిమ్ డేవిడ్ డకౌటవడం ముంబైలో ఆశలు చిగురించాయి. కాసేపటికే కృనాల్ పాండ్యా 73 (4 ఫోర్లు, 5 సిక్సర్లు) వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

19వ ఓవర్ ను బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులే ఇవ్వడంతో విజయం కోసం చివరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి వచ్చింది. షెఫర్డ్ భారీ షాట్లు కొట్టలేక పడగా.. బౌలర్ రాజ్ బవా ఒత్తిడికి లోనై వైడ్లు వేశాడు. 11 బంతులాడి 4 పరుగులే చేసిన షెఫర్డ్ మూడో బంతికి ఔటవడంతో ముంబై గెలుస్తుందనుకున్నారు. అయితే క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఆర్సీబీ(RCB) ఊపిరి పీల్చుకుంది. చివరి బంతికి సలామ్ దార్ రెండు పరుగులు తీయడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Modi : బంగారం కొనొద్దు..ప్రధాని మోదీ సంచలన పిలుపు

Exit mobile version