RCB vs RR
ఐపీఎల్ 19వ సీజన్ లో మరో రసవత్తర సమరానికి వేళయింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ , డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs RR) తలపడనున్నాయి. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సమఉజ్జీల సమరంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ మంచి ఫామ్ లో ఫన్నాయి. రాజస్థాన్ రాయల్స్(RCB vs RR) మూడు మ్యాచ్ లకు మూడింటిలోనూ గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ , ముంబై జట్లపై విజయాలను అందుకుంది. గత మ్యాచ్ లో ముంబైకి చుక్కలు చూపించింది.
రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్ జైస్వాల్ , వైభవ్ సూర్యవంశీ కాంబినేషన్ దుమ్మురేపుతోంది. గత మ్యాచ్ లో వైభవ్ మెరుపులతో పాటు జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. బుమ్రాతో సహా ముంబై బౌలర్లను ఉతికారేశాడు. వైభవ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆర్సీబీ బౌలర్లు కూడా వైభవ్ ను త్వరగానే ఔట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే జురెల్, పరాగ్, హెట్ మెయిర్ లాంటి హిట్టర్స్ కూడా రాజస్థాన్ కు ప్లస్ పాయింట్. అటు బౌలింగ్ లోనూ రాయల్స్ ఫామ్ లో ఉంది.
ఆర్చర్, బర్గర్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్నారు. గుజరాత్ తో మ్యాచ్ లో వీరంతా సమిష్టిగా రాణించడంతోనే గెలిచింది. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. గత మ్యాచ్ లో బిష్ణోయ్ 4 కీలక వికెట్లతో తన మ్యాజిక్ చూపించాడు.దీంతో మరోసారి బిష్ణోయ్ కీలకం కాబోతున్నాడు. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు..
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs RR) కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతోంది. ఆర్సీబీ బ్యాటర్లు అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 200కు పైగా టార్గెట్ ఛేదించిన ఆర్సీబీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పై విశ్వరూపం చూపించింది. ఏకంగా 250 పరుగులు చేసి తమ స్టామినా నిరూపించుకుంది. కోహ్లీ, సాల్ట్ , పడిక్కల్, పటిదార్ చెలరేగిపోతున్నారు.
వీరిని ఆపడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కావట్లేదు. అలాగే చెన్నైతో మ్యాచ్ లో టిమ్ డేవిడ్ విధ్వంసం ఓ రేంజ్ లో సాగింది. భారీ షాట్లతో రెచ్చిపోయిన టిమ్ డేవిడ్ పైనే ఆర్సీబీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ లో కూడా రాజస్థాన్ కు ధీటుగా బెంగళూరు కనిపిస్తోంది. పేస్ ఎటాక్ లో వెటరన్ భువనేశ్వర్ కుమార్ తో పాటు డఫీ, రొమారియో షెఫర్డ్ రాణిస్తున్నారు. అటు స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా కీలక సమయంలో వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు. స్పిన్నర్ గా బౌన్సర్లు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
దీంతో కృనాల్ బౌలింగ్ ను ఎదుర్కోవడం రాజస్థాన్ బ్యాటర్లకు సవాలే. ఓవరాల్ రికార్డ్స్ లో రాజస్థాన్ పై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 34 సార్లు తలపడితే ఆర్సీబీ 17 మ్యాచ్ లలో గెలిచింది. రాజస్థాన్ 14 మ్యాచ్ లలో గెలిచింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గువాహటి పిచ్ హైస్కోరింగ్ గ్రౌండ్ గా అంచనా వేస్తున్నారు. దీంతో పరుగుల వరద ఖాయం.
David Miller : సింగిల్ తీయని మిల్లర్…మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా ?
