ROKO
ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో వరుసగా వైట్ వాష్ పరాభవం చవి చూసిన టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్ సవాల్‌కు సిద్ధమైంది. టీ20 జట్టుతో పోలిస్తే సీనియర్ల రోల్ పెరగనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలపైనే అందరి చూపు ఉంది. వారం రోజుల ముందే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోకో(ROKO) జోడీ వన్డే సిరీస్‌లో ఎలా ఆడుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టీ20 ఫార్మాట్‌తో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో భారత్ మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇవే పిచ్‌లపై ఆడిన అనుభవం రోహిత్ , కోహ్లీ, గిల్ , రాహుల్ వంటి బ్యాటర్లకు చాలానే ఉంది.
క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కుకుని , పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడమే ఈ ఫార్మాట్‌లో కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇంగ్లీష్ పిచ్ కండీషన్స్ ఏ బ్యాటర్‌కైనా సవాలే.
ఆ ఛాలెంజ్ కోసం కోహ్లీ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో పిచ్‌పై నీళ్లు చల్లి, ఇంగ్లీష్ కండీషన్స్ తరహాలోనే సాధన చేశాడు. అటు రోహిత్ శర్మ కూడా ఫిట్‌నెస్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నాడు. మూడు రోజులుగా నెట్స్‌లో హిట్ మ్యాన్ సైతం చెమటోడ్చుతున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ , కోహ్లీ ఇద్దరికీ అద్భుతమైన రికార్డుంది. వన్డేల్లో అక్కడ ఆడిన 33 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 1,349 పరుగులు చేశాడు. 51.88 సగటుతో బ్యాటింగ్ చేసిన విరాట్ ఖాతాలో 1 సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లాండ్‌లో హిట్‌మ్యాన్ కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లోనే 43.66 సగటుతో 786 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై వన్డేల్లో రోహిత్ అత్యధిక స్కోరు 137 నాటౌట్ గా ఉంది.
ఇటీవల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ సీమ్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక యువ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అయితే వన్డే జట్టులో మాత్రం కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి సీనియర్లు ఉండడంతో అంచనాలు పెరిగాయి.
ఈ సిరీస్‌కు సంబంధించి టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ కీలకం కాబోతోంది. వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా , శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. గాయాల కారణంగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి దూరమవడంతో వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారు.
Mccullum : బజ్‌బాల్ శకానికి ముగింపు..టెస్ట్ కోచ్‌గా తప్పుకున్న మెక్‌కల్లమ్
