Sanju Samson : వద్దనుకున్నోడే దిక్కయ్యాడు..ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సంజూ

Sanju Samson : ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఇది సినిమా డైలాగ్... మరి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు మ్యాచ్ గెలిపించామా లేదా.. ఇదీ టీ20 ప్రపంచకప్ లో సంజూ శాంసన్ గురించి వినిపిస్తున్న మాట

Sanju Samson

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఇది సినిమా డైలాగ్… మరి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు మ్యాచ్ గెలిపించామా లేదా.. ఇదీ టీ20 ప్రపంచకప్ లో సంజూ శాంసన్(Sanju Samson) గురించి వినిపిస్తున్న మాట.. అసలు తుది జట్టులో అనవసరం..శుద్ధ దండగ అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు…

ఎన్ని అవకాశాలిచ్చినా వృథా చేసుకుంటాడు.. అంటు తిట్లు తిన్నవాడు.. ప్రపంచకప్ కు ఎందుకు సెలక్ట్ చేసార్రా బాబూ అంటూ  ట్రోలింగ్ కు గురైన వాడు.. వారి విమర్శలకు తగ్గట్టే అవకాశాలిచ్చిన లీగ్ స్టేజ్ , సూపర్ 8 ఆరంభ మ్యాచ్ లలో నిరాశపరిచాడు. అతని కెరీర్ ముగిసినట్టే అంటూ చాలా మంది మాజీలు తేల్చేశారు.

కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న మాటను పట్టుదలతో ఫాలో అయ్యి దుమ్మురేపాడు. అది కూడా నాకౌట్ మ్యాచ్ లలో జట్టును గెలిపించాడు. అతనెవరో కాదు కేరళ క్రికెటర్, భారత ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson)… ఈ యువ ఓపెనర్ టాలెంట్ కు కొదవ లేదు. అయితే వచ్చిన సమస్యల్లా అనవసరంగా వికెట్ పారేసుకోవడం, నిలకడలేమి.. ఈ కారణంగానే అరంగేట్రం చేసి 11 ఏళ్లు అవుతున్నా కేవలం 62 టీ ట్వంటీలే ఆడాడు. మరో ప్లేయర్ అయితే వందకు పైగా మ్యాచ్ లు ఆడి ఉండేవాడు.

టీ20 ప్రపంచకప్ తన కెరీర్ లో చివరి అవకాశంగా భావించిన సంజూ శాంసన్ కీలకమైన మ్యాచ్ లలో చెలరేగిపోయాడు. డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఏదో గాలివాటంలా ఆడాడంటూ కొందరు విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోకుండా సెమీఫైనల్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సంజూ.

Sanju Samson

ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేస్తూ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఫైనల్లోనూ అదే సూపర్ ఫామ్ కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

హ్యాట్రిక్ ఫిఫ్టీతో జట్టు భారీస్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత జట్టు ఒక ఐసీసీ టోర్నీలో ఎంతో ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్ లలో వరుసగా రెండుసార్లు 250 ప్లస్ స్కోరు చేసిందంటే దానికి కారణం కచ్చితంగా సంజూ శాంసనే. ప్రస్తుత పరిస్థితుల్లో 200 ప్లస్ స్కోర్లు ఈజీగా ఛేజ్ చేసేస్తున్నారు.

Sanju Samson

అందుకే మ్యాచ్ గెలవాలంటే వీలైనన్ని ఎక్కువ పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసి విజయాలను అందించాడు. సంజూ శాంసన్ ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

2014 టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ 319 రన్స్ చేస్తే ఇప్పుడు సంజూ కేవలం 5 మ్యాచ్ లలోనే 321 పరుగులు చేశాడు. అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మొత్తం 24 సిక్సర్లు బాదిన సంజూ(Sanju Samson) ఒకే ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొనగాడిగా నిలిచాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో జట్టును గెలిపించే ఇన్నింగ్స్ లు ఆడడంతోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version