SRH vs PBKS : పంజాబ్ పై సన్ రైజ్ అయ్యేనా ?..ఉప్పల్ స్టేడియంలో బిగ్ ఫైట్

SRH vs PBKS : ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి

SRH vs PBKS

ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి. అధికారికంగా ఏ జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. ఈ నేపథ్యంలో టాప్ 3లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్(SRH vs PBKS) తో తలపడబోతోంది.

వరుసగా ఐదు విజయాల తర్వాత గత మ్యాచ్ లో అనూహ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. టాపార్డర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా 200 ప్లస్ స్కోరు చేస్తుందనుకుంటే 165 పరుగులకే పరిమితమైంది. అటు బౌలింగ్ లోనూ పెద్దగా రాణించకపోవడంతో కోల్ కతా సునాయాసంగా గెలిచింది.

ఈ నేపథ్యంలో బ్యాటర్లు, బౌలర్లు మునుపటి ఫామ్ తో చెలరేగాల్సిన పరిస్థితి వచ్చింది. హోంగ్రౌండ్ కావడంతో సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. అందులోనూ ఉప్పల్ పిచ్ పూర్తిగా ఫ్లాట్ వికెట్ కావడంతో సన్ రైజర్స్ బ్యాటర్లపై భారీ అంచనాలుంటాయి. గత మ్యాచ్ తప్పిదం రిపీట్ అయ్యి భారీస్కోరు చేయకుంటే పంజాబ్ కింగ్స్ చేతిలోనూ ఓటమి తప్పదు.

గత మ్యాచ్ లో అనారోగ్యం కారణంగా ఆడలేకపోయిన నితీష్ కుమార్ రెడ్డి పంజాబ్ కింగ్స్ పై బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

SRH vs PBKS

మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో వరుస ఓటములతో డీలాపడిన ఆ జట్టు సన్ రైజర్స్ ను ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ , స్టోయినిస్ వంటి స్టార్స్ తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది.

అయితే హోంగ్రౌండ్ లో బౌలింగ్ పరంగానూ ఆకట్టుకుంటున్న సన్ రైజర్స్ ను ఈ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.అటు బౌలింగ్ లో మార్కో జెన్సన్, బార్ట్ లెట్ , అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ లో కీలకంగా ఉన్నారు. స్పిన్ విభాగం చాహల్ పైనే భారం పడనుంది. గత రికార్డులను చూస్తే సన్ రైజర్స్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 25 సార్లు తలపడితే 17 మ్యాచ్ లలో సన్ రైజర్స్ గెలవగా, 8 మ్యాచ్ లలో పంజాబ్(SRH vs PBKS) విజయం సాధించింది. ఇక ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారనుంది.

Chennai Super Kings : సంజూ ధనాధన్..చెన్నైకి మరో విజయం

Exit mobile version