SunRisers : చెపాక్ లో చెన్నైకి చెక్..ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్

SunRisers : నువ్వా నేనా..? అన్న‌ట్లు సాగిన మ్యాచ్ లో మాజీ చాంపియ‌న్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది

SunRisers

ఐపీఎల్ 19వ సీజన్ లో మరో రెండు జట్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాయి. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి సన్ రైజర్స్(SunRisers) హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంది. బౌలింగ్ లో కమిన్స్ , బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ , క్లాసెన్ మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ గెలుపుతో అటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం 5 జట్లు రేసులో నిలిచాయి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫిట్ గా లేకపోవడంతో ధోనీ ఈ మ్యాచ్ లోనూ ఆడలేదు. చెన్నైకి ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 31 పరుగులు జోడించారు. ఫామ్ లో ఉన్న సంజూ 13 బంతుల్లో 27 (5 ఫోర్లు, 1 సిక్సర్) ,ఉర్విల్ పటేల్ (13) పరుగులకు ఔటయ్యారు.

ఈ దశలో రుతురాజ్, కార్తీక్ శర్మ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కార్తీక్ శర్మ 19 బంతుల్లో 32 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. తర్వాత బ్రెవిస్, దూబే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో స్కోర్ వేగం పుంజుకుంది. బ్రెవిస్ 22 బంతుల్లో 44 (2 ఫోర్లు, 4 సిక్సర్లు) , దూబే (26) పరుగులకు వెనుదిరిగారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. నిజానికి సీఎస్కే దూకుడు చూస్తే 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టడి చేసారు. కమిన్స్ 3, సాకిబ్ హొస్సేన్ 2 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్ లో సన్ రైజర్స్(SunRisers) కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ (6) పరుగులకే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండోవికెట్ కు 38 రన్స్ జోడించారు. అభిషేక్ శర్మ (26) వెనుదిరిగినా ఇషాన్ కిషన్ , క్లాసెన్ చెలరేగిపోయారు.

SunRisers

ఫామ్ లో ఉన్న వీరిద్దరూ సీఎస్కే బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. అటు క్లాసెన్ కూడా తన క్లాసిక్ బ్యాటింగ్ తో మరోసారి అదరగొట్టాడు. క్లాసెన్ 26 బంతుల్లో 47 ( 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. ఇషాన్ కిషన్ ధాటిగా ఆడడంతో లక్ష్యఛేదనలో పెద్ద టెన్షన్ లేకుండా పోయింది.

భారీ షాట్లతో సాధించాల్సిన రన్ రేట్ ఒత్తిడి లేకుండా చూసిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 70 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. చివర్లో సలీల్ అరోరా (10), స్మరన్ రవిచంద్రన్ (5) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో సన్ రైజర్స్(SunRisers) ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. గుజరాత్ టైటాన్స్ కూడా ముందంజ వేసింది.

Peddi Trailer : ఆట మారుతోంది..ఆటగాడు మారట్లే..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పెద్ది ట్రైలర్

Exit mobile version