Just Andhra PradeshJust PoliticalLatest News

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ఎయిర్‌పోర్ట్ రెడీ .. బాబు, పవన్, లోకేష్ భావోద్వేగ కామెంట్స్..

Bhogapuram Airport:  ప్రధాని వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వస్తుండగా, వేలాది మంది గిరిజన యువతులు, స్టూడెంట్స్ ప్రదర్శించిన థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Bhogapuram Airport

ఒకప్పుడు సరైన రోడ్డు లేక, కనీసం ఎర్ర బస్సు కూడా సరిగ్గా రాదంటూ అవహేళనలు ఎదుర్కొన్న నేల అది. కానీ ఇప్పుడు అదే నేల నుంచి ఆకాశమే హద్దుగా ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్స్ కూడా పయనించడానికి సిద్ధమయ్యాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలను మారుస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభం అయింది.

ఒక ప్రాంతపు దశాబ్దాల కలను నిజం చేస్తూ జరిగిన ఈ మెగా కార్యక్రమం, ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరి పోసిందనే చెప్పొచ్చు. ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రారంభోత్సవానికి గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, అశోక్‌గజపతిరాజు వంటి అగ్ర నాయకులంతా వచ్చారు.

ఈ అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(Bhogapuram Airport) ప్రారంభోత్సవ సంబురం.. కేవలం రిబ్బన్ కట్ చేయడంతోనే ఆగిపోలేదు. కొత్తగా నిర్మించిన భారీ టెర్మినల్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యటించారు. అక్కడ అందుబాటులోకి తెచ్చిన ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉన్న సదుపాయాలను, టెక్నాలజీని దగ్గరుండి పరిశీలించారు.

ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి.మల్లిఖార్జునరావు, బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ఎయిర్‌పోర్టు విశేషాలను, దీని నిర్మాణం వెనుకున్న కష్టాన్ని ప్రధాని మోదీకి వివరించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దంపట్టేలా, తెలుగువారి కళావైభవమైన అరుదైన బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సత్కరించారు.

కాగా అంతకుముందు ప్రధాని వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వస్తుండగా, వేలాది మంది గిరిజన యువతులు, స్టూడెంట్స్ ప్రదర్శించిన థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఈ నృత్యాన్ని.. ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ, ప్రజలందరికీ నమస్కరిస్తూ ముందుకు వెళ్లిన తీరు ఎంతో ఆసక్తికరంగా సాగింది.

పవిత్రమైన ఉత్తరాంధ్ర గడ్డపై తాను అడుగుపెట్టడం ఎంతో గర్వకారణమని తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌(Bhogapuram Airport)తో పాటు దాదాపు రూ. 18 వేల కోట్ల విలువైన కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

సింహాచలం అప్పన్న, అలాగే పైడితల్లి అమ్మవార్లకు ప్రణామాలు అర్పిస్తూ, ఈరోజు స్వర్ణాంధ్ర విజన్‌లో ఒక కీలకమైన మైలురాయి అని మోదీ అభివర్ణించారు. 13 వేల మంది మహిళలు ప్రపంచ రికార్డు సృష్టిస్తూ ప్రదర్శించిన థింసా నృత్యం మన వారసత్వానికి ప్రతీక అని కొనియాడిన మోదీ..ఏపీ అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు చూపిస్తున్న దార్శనికతను అభినందించారు.

అనంతరం ఈ వేదికపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం వంటిదని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజల కలలన్నీ నెరవేరాయని కొనియాడారు. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్టు కోసం తమ సొంత భూములను త్యాగం చేసిన రైతులకు పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు.

రెండేళ్ల క్రితం తీవ్రంగా దెబ్బతిన్న ఏపీని మళ్లీ తిరిగి నిలబెడతామని తామన్న మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఎర్రబస్సు కూడా రాని ప్రదేశమని గతంలో ఈ ప్రాంతాన్ని అవహేళన చేసిన వాళ్లకి, ఇప్పుడు ఇక్కడ వాలిన ఎయిర్‌బస్సే సరైన సమాధానమని కౌంటర్ ఇచ్చారు.

Bhogapuram Airport
Bhogapuram Airport

ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించిన జీఎంఆర్ అధినేత, దానికి తొలి అడుగు వేసిన అశోక్‌గజపతిరాజుతో పాటు దాన్ని పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లిన రామ్మోహన్‌ నాయుడు.. వీళ్లంతా ఉత్తరాంధ్ర బిడ్డలే కావడం మనందరికీ గర్వకారణమని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో గూగుల్, స్టీల్ ప్లాంట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇక్కడికి రాబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర వికాసంలో ఒక కొత్త చాప్టర్ మొదలైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అన్నారు. సీఎం చంద్రబాబు లీడర్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 140 కోట్ల మంది ప్రజల ఆశలను నిజం చేస్తూ వికసిత్ భారత్ వైపు మన దేశాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు.

Bhogapuram Airport
Bhogapuram Airport

ఇక ఐటీ మంత్రి నారా లోకేష్ తనదైన స్టైల్‌లో ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు. ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్‌పోర్ట్(Bhogapuram Airport) అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారికి ఇదే మన సమాధానం! ఇక్కడ ఎయిర్‌పోర్టు కూడా వచ్చింది, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు.. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా అంటూ పదునైన పంచ్‌లతో అదరగొట్టారు.మొత్తంగా ఈ కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్న రీతిలో గ్రాండ్‌గా జరిగిందని అందరి నోట వినిపిస్తోంది.

Bhogapuram Airport : భోగాపురం జర్నీ ఇక నాన్‌స్టాప్.. 7 కనెక్టింగ్ రోడ్లు, స్పెషల్ ఈ-బస్సులు

Related Articles

Back to top button