Basavatarakam
క్యాన్సర్ అనే మూడక్షరాల మహమ్మారి తెచ్చే నొప్పికంటే, ఆ ట్రీట్మెంట్‌కు అయ్యే ఖర్చును చూసి బతుకుపై ఆశలు వదిలేసుకునే పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ పాతికేళ్ల క్రితం, అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా నేనున్నాను అంటూ హైదరాబాద్‌లోని బసవతారకం(Basavatarakam) ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొండంత ధైర్యంగా నిలిచింది
క్యాన్సర్ మహమ్మారితో తన ప్రాణసఖి బసవతారకంను కోల్పోయిన నాటి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు.. తనలాంటి గుండె కోత, బాధ మరెవ్వరికీ రాకూడదనే ఆశయంతో, పట్టుదలతో ఈ సేవా దేవాలయానికి పునాది వేశారు.
నాటి ఎన్టీఆర్ పవిత్ర ఆశయాన్ని తన గుండెలకు హత్తుకుని.. కేవలం నటుడిగానే కాకుండా ఓ బాధ్యతగల బిడ్డగా ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ .. ఎంతోమంది జీవితాలలో వెలుగును నింపారు. అంతేకాదు ఈ రోజు పాతికేళ్ల రజతోత్సవాల తీరానికి చేర్చి సగర్వంగా తలెత్తుకుని చెప్పేలా బసవతారకంను తీర్చిదిద్దారు.
లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్లకు లేటెస్ట్ టెక్నాలజీతో వైద్య సేవలను అందిస్తూ, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన బసవతారకం(Basavatarakam) ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు గతేడాది ప్రారంభం కాగా.. ఈ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్‌ను లాభాపేక్ష లేకుండా అందరికీ అందించాలనే ఉద్దేశంతో 1988లో స్వర్గీయ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఎందరో స్పెషలిస్ట్‌లు, ఎన్‌ఆర్‌ఐ, దాతల సాయంతో ట్రస్ట్ ఏర్పాటు కాగా.. 2000 జూన్ 22న అప్పటి దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకలతో ఈ హాస్పిటల్ ప్రారంభమైంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా విస్తరించుకుంటూ ఇప్పుడు 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే అత్యంత ఫేమస్ క్యాన్సర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ సంస్థగా బసవతారకం(Basavatarakam) ఆసుపత్రి అవతరించింది.
ఈ ఆసుపత్రి కేవలం తెలంగాణ, ఏపీలకే పరిమితం అవకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది క్యాన్సర్ బాధితులకు సంజీవినిలా మారింది. ఈ హాస్పిటల్‌లో ఏటా 3 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లు, 90 వేల మంది ఇన్ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
అంతేకాదు ఇప్పటివరకు ఇక్కడ 8 వేలకు పైగా క్రిటికల్ క్యాన్సర్ సర్జరీలు, 86 బోన్ మ్యారో మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆసుపత్రికి వచ్చేవారిలో 65 శాతానికి పైగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారే ఉంటారు. ఇలాంటి పేద రోగులకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన కార్పొరేట్ ట్రీట్మెంట్‌ను అందిస్తున్నారు.
హెడ్, నెక్, రొమ్ము, సర్వైకల్, ప్రోస్టేట్ సహా ఎన్నో రకాల క్యాన్సర్లకు ఒకే చోట నిర్ధారణ, సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ సర్వీసులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపు 250 మంది నిపుణులైన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు.
అంతేకాకుండా, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లకు నొప్పి నివారణ, వారి జీవన నాణ్యత మెరుగుదల కోసం స్పెషల్ పాలియేటివ్ కేర్ సర్వీసులు ఇక్కడ ప్రత్యేక గుర్తింపును పొందాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు క్యాన్సర్‌ను స్టార్టింగ్ స్టేజ్‌లోనే గుర్తించడం కోసం మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఫ్రీగా టెస్టులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఈ సేవా ప్రస్థానాన్ని మరింతగా విస్తరిస్తూ, ఏపీ ప్రజలకు మరింత దగ్గరగా లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించడానికి అమరావతిలోనూ సరికొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుండటం మరో విశేషంగా నిలుస్తుంది.
