Section 22-A
ఒక సామాన్యుడు పైసా పైసా కూడబెట్టి, ఇంట్లో చిన్న బంగారం ముక్క కూడా ఉంచుకోకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 30 ఏళ్ల బ్యాంక్ ఈఎంఐల భారాన్ని నెత్తినేసుకుని మరీ సొంతింటి కలను నిజం చేసుకుంటాడు. కానీ ఒక రోజు ఎవరో ఉన్నట్టుండి వచ్చి..నువ్వుంటున్న ఇల్లు నీది కాదు, అసలు ఈ భూమిపైన నీకు ఏ హక్కూ లేదని రికార్డుల్లో రాసేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే మానసిక నరకం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌ను పట్టి పీడిస్తోంది.
ఈమధ్య ఏ వీధిలో చూసినా, ఏ టీ కొట్టు దగ్గర నిలబడినా 22-ఏ గురించే మాట.. దాని గురించే భయం. ఎలాంటి నోటీసుల్లేకుండా, ఎలాంటి హెచ్చరికలూ లేకుండా.. గుట్టు చప్పుడు కాకుండా లక్షకు పైగా ఆస్తుల భాగ్యరేఖలను ఒకే ఒక్క స్ట్రోక్‌తో రెవెన్యూ అధికారులు మార్చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చట్టబద్ధంగా ఉంటూ, అన్ని పన్నులూ కడుతున్న సామాన్యుల జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయాయి.
ఇది ఏ ఒక్క మూలకో పరిమితం కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పెద్ద పెద్ద ప్రైమ్ లొకేషన్లు ఇప్పుడు స్తంభించిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ లాంటి హై-ఫై ఏరియాల నుంచి ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, ఖైరతాబాద్ వరకు వందలాది మంది ఆస్తులను ఈ లిస్టులోకి తోసేశారు.
చివరికి ఎర్రగడ్డలోని వాసవి, బ్రిగేడ్ సిటాడెల్, జనప్రియ వంటి బడా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, యూసుఫ్‌గూడలోని హౌసింగ్ సొసైటీలు, సనత్‌నగర్, ఉప్పల్ దగ్గరలోని వందలాది ఎకరాల నివాస ప్రాంతాలు డిలీట్ అయిపోయాయి. దీంతో ఈ ఏరియాల్లోని వేలాది కుటుంబాలు తమ ఆస్తులను అమ్ముకోలేక, కనీసం ఎమర్జెన్సీకి లీజ్ కూడా ఇచ్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
అప్పో సప్పో చేసి ఇల్లు కొనుక్కుని ఇక రేపో మాపో రిజిస్ట్రేషన్ చేయించుకుని కొత్త ఇంటికి వెళ్లాలనుకుంటున్న వారి కలలన్నీ అడియాసలు అయిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లగానే ఈ ఆస్తి నిషేధిత 22-ఏ జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ అవ్వదని గేట్లు మూసేస్తున్నారు.
కట్టిన అడ్వాన్స్ రాక, ఆస్తి చేతికి అందక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి డ్రామాలు సిటీ వ్యాప్తంగా రోజూ వందల్లో జరుగుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎన్‌వోసీ (NOC) పేరుతో నడుస్తున్న ఈ గోడల వెనుక అసలు నిజాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో రిజిస్ట్రేషన్లు బంద్ అవ్వడంతో బ్యాంకులు కొత్త లోన్ల తలుపులను మూసేశాయి.ఆస్తులను మార్ట్‌గేజ్ చేసుకుని ఇచ్చిన ఆ అప్పులన్నీ కూడా రికవరీ అవుతాయా లేదా అనే భయంతో బ్యాంకర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇక ఇటు ఇప్పటికే ఈ అపార్ట్‌మెంట్లు, ప్లాట్స్‌పై బ్యాంకులు ఇచ్చిన వందల కోట్ల రూపాయల లోన్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న బాధితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తమ ఆస్తిపై తమకే హక్కు లేదని తేలాక ఈఎంఐలు ఎలా కట్టాలని ప్రశ్న వారిని వేధిస్తుంది.
మరి ఈ మొత్తం రచ్చ వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరు?..అసలు అసలైన ప్రభుత్వ ఆక్రమణలను వదిలేసి, ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న మధ్యతరగతి జనాలను కావాలనే ఈ జాబితాలో ఎందుకు ఇరికించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనివెనుక రాజకీయ నేతలు, అధికారులు, వారి అనుచరులు నడిపిస్తున్న భారీ వసూళ్ల దందా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు బాధితులకు ఎన్‌వోసీలు ఇప్పించడం, లాయర్ల ఫీజులు, ఆఫీసర్ల లంచాల పేరుతో కోట్లాది రూపాయల బేరసారాలు జరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆపదలో ఉన్న ఇలాంటివారి నుంచి లక్షలు పిండుకోవడానికే ఈ 22-ఏ(Section 22-A) అనే భూతాన్ని తెరమీదకు తీసుకువచ్చారన్న ప్రచారం సాగుతోంది.
కాగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ నమోదు చట్టం (Registration Act, 1908) ప్రకారం సెక్షన్ 22-ఏ (Section 22-A) అనేది ఒక రకమైన నిషేధిత జాబితా (Prohibited Properties List) అన్నమాట. అంటే, ఒక స్థలం లేదా ఇల్లు ఈ 22-ఏ లిస్టులో ఉంటే.. సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దాని రిజిస్ట్రేషన్ చేయడం కానీ, అలాగే అమ్మడం, కొనడం కానీ లేదా వేరొకరికి బదిలీ చేయడం వంటివి చట్టరీత్యా కుదరదు.
