Konda Surekha
తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో మరోసారి పాత సీన్ రిపీట్ అవుతూ..అంతర్గత విబేధాలు మళ్లీ రచ్చకెక్కాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు గాంధీభవన్‌తో పాటు, సెక్రటేరియట్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది.
ఏకంగా సొంత పార్టీకి చెందిన 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఒకే తాటిపైకి వచ్చి.. ఒక కేబినెట్ మంత్రిపై చర్యలు తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేయడమంటే కాంగ్రెస్‌లోనే ఇది అరుదైన పరిణామంగా చెబుతున్నారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం.. ఈ ఎపిసోడ్‌పై ఫైనల్ డెసిషన్ రావడం సుమారు ఖాయంగానే కనిపిస్తోంది.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత డైరెక్టుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసిన కామెంట్లతోనే ఈ రగడ ప్రారంభమయింది. పరకాల నియోజకవర్గం సీటు విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఆమె చేసిన కామెంట్లు పార్టీ గ్రూపు రాజకీయాలను రోడ్డు మీదకు తెచ్చాయి.
దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ .. కొండా సుస్మిత లక్ష్మణరేఖ దాటి మాట్లాడారని, గతంలో కొండా సురేఖను పార్టీ హైకమాండ్ కాపాడినా ఈసారి మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వంటి లీడర్లు చేసిన వ్యాఖ్యల కంటే సుస్మిత డైరెక్టుగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు తీవ్రమైనవిగా పార్టీ భావిస్తోంది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేతృత్వంలో.. చాలాసేపు చర్చలు జరిగాయి. కొండా సురేఖ తనకు పంపిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇస్తూ ..సహజ న్యాయ సూత్రాల ప్రకారం తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని డిఫెన్స్ తీసుకునే ప్రయత్నం చేయడంపై మల్లు రవి మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ కూడా, సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దానిని ఖండించాల్సిన కనీస బాధ్యత కొండా సురేఖపై లేదా అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో సురేఖ రాసిన మరో లేఖ మళ్లీ ఆజ్యం పోసినట్లు అయింది. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతుండగానే ఎమ్మెల్యేలు తనను ఓపెన్‌గా విమర్శించడం వెనుకున్న అదృశ్య శక్తి ఎవరో తేల్చాలని కొత్త లాజిక్‌ను తెరమీదకు తీసుకువచ్చారు . ఇదంతా తన ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న కుట్ర అని ఆరోపించడం తెలంగాణ కాంగ్రెస్ ముఖచిత్రంలో చాలా మార్పులు రానున్నట్లే చెబుతున్నాయి.
మరోవైపు, పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వేం నరేందర్ రెడ్డి వంటి సీనియర్లు వరుసగా ప్రజాప్రతినిధులతో మాట్లాడగా..మెజారిటీ నేతలు సురేఖను కేబినెట్ నుంచి తప్పించాల్సిందేనని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, ఈ ఐక్యత లోపం ఈరోజుది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, అధికారంలోకి వచ్చినా కూడా.. నాయకుల మధ్య పర్సనల్ డామినెన్స్, నియోజకవర్గ ఆధిపత్య పోరు కాంగ్రెస్ కల్చర్‌లో భాగమైపోయాయి.
పార్టీ లైన్ కంటే తమ ఉనికిని చాటుకోవడం, పర్సనల్ ఇమేజ్, ఫ్యామిలీ పొలిటికల్ కెరీరే ముఖ్యమని కొందరు భావించడం వల్ల కాంగ్రెస్‌లో ఎప్పటికప్పుడు అయోమయ పరిస్థితులు నెలకొంటూనే ఉంటాయి. అందుకే ఈసారి అయినా సురేఖ విషయంలో హైకమాండ్ గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం.. భవిష్యత్తులో మిగిలిన నేతలు కూడా ఇలాగే క్రమశిక్షణను గాలికి వదిలేస్తారనే ఆందోళన గాంధీభవన్‌లో కనిపిస్తోంది.
దీనిపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీ క్రమశిక్షణే తమ ఫస్ట్ ప్రయారిటీ అని క్లారిటీ ఇచ్చేశారు. కొండా సురేఖ(Konda Surekha) ఎపిసోడ్‌తో పాటు చిన్నారెడ్డి, మేఘారెడ్డిల వివాదం, ఆదిలాబాద్ పార్టీ తగాదాలపై కూడా రిపోర్టులు సిద్ధమయ్యాయి.
ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ పెద్దలు మాట్లాడిన తర్వాత కొండా సురేఖ(Konda Surekha)ను మంత్రివర్గం నుంచి తొలగించడమో లేదంటే కీలక శాఖల నుంచి తగ్గించడమో జరగడం మాత్రం గ్యారంటీ అని తెలుస్తోంది. మరి ఈ వేటు పడితే కొండా దంపతులు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారనేది తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
