deadly snacks:చంపేసే స్నాక్స్‌పై సరికొత్త ప్రచార యుద్ధం..
deadly snacks:కేవలం ధూమపానం(Smoking) మాత్రమే కాదు, ఈ వేయించిన, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు బల్లగుద్ది చెబుతున్నారు.

deadly snacks:వర్షం పడిందంటే చాలు వేడి వేడి టీతో పాటు సమోసా, జిలేబీ, పకోడీలు… ఓ పట్టుబడితే ఆ ఫీలే వేరు. దీనికి తోడు ఎన్ని తిన్నా ఇంకా కావాలనిపించే ఈ వేయించిన రుచులు నాలుకకు నచ్చినా, ఆరోగ్యాన్ని మాత్రం నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయని వైద్య నిపుణులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
పొగ తాగడం మాత్రమే కాదు, ఇవి కూడా హానికరం
ఇలాగే వదిలేస్తే, ఆరోగ్యాలు గుల్ల అవడం తప్పదని వైద్యులు(Doctors) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మనకెంతో ఇష్టమైన ఈ స్నాక్స్‌పైనా ఇకపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు(Warning Labels) కనిపించనున్నాయి!
కేంద్రం బిగ్ మూవ్..
కేవలం ధూమపానం(Smoking) మాత్రమే కాదు, ఈ వేయించిన, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు బల్లగుద్ది చెబుతున్నారు. అందుకే, ఇన్నాళ్లూ సిగరెట్ ప్యాకెట్లపై కనిపించిన “ఆరోగ్యానికి హానికరం” అనే హెచ్చరికలు…
ఇకపై సమోసా, జిలేబీ, పకోడీ, ఛాయ్ బిస్కెట్ వంటి స్నాక్స్ స్టాళ్ల దగ్గర, ఫుడ్ కోర్టుల్లో, క్యాంటీన్లలో కూడా దర్శనమివ్వనున్నాయి.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హానికారక కొవ్వులు, అధిక చక్కెర ఉండే ఈ ఆహారాల పక్కన హెచ్చరిక బోర్డులు, పోస్టర్లను ఏర్పాటు చేయనుంది.
భారత్‌కు రాబోయే ఊబకాయ ముప్పు.. 2050 నాటికి రెండో స్థానం
నిజానికి, ఈ నిర్ణయం వెనుక ఓ తీవ్రమైన కారణం ఉంది. అధిక చక్కెర, డీప్ ఫ్రైడ్ ఫుడ్ విపరీతమైన వాడకంతో భారతదేశంలో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారుతోంది.
కేంద్రం అంచనాల ప్రకారం, 2050 నాటికి 44 కోట్ల మందికి పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడతారని తేలింది. ఇది జరిగితే, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులున్న రెండో దేశంగా భారత్ మారనుంది.
ఈ భయంకరమైన పరిస్థితిని నివారించడానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నాగ్‌పూర్ ఎయిమ్స్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల కేఫ్ టేరియాలు, ఫుడ్ కోర్టుల్లో “ఆయిల్ అండ్ షుగర్” బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది.
మనం తినే స్నాక్స్‌లో కొవ్వు, నూనె, చక్కెర, ఉప్పు శాతం ఎంత ఉంది? అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వంటి వివరాలతో ఈ బోర్డులు, పోస్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
సిగరెట్ ప్యాకెట్ల తరహాలోనే డిజైన్..
ముందుగా నాగ్‌పూర్ ఎయిమ్స్‌తో పాటు ఇతర ప్రముఖ ఫుడ్ స్టాల్స్ పక్కన ఈ హెచ్చరిక పోస్టర్లు, బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఆ స్నాక్స్‌లో ఉండే చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ల వివరాలను ఆ పోస్టర్లలో క్లియర్‌గా పేర్కొంటారు.
తరచుగా ఈ ఫుడ్స్ తింటే కలిగే అనారోగ్యాల వివరాలను కూడా ప్రస్తావిస్తారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా, అత్యంత ప్రభావం చూపించేలా, సిగరెట్ ప్యాకెట్లపై ఉండే హెచ్చరికల తరహాలో ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.
నిషేధం కాదు, కేవలం ‘రిమైండర్’ మాత్రమే.. కేంద్రం క్లారిటీ..
అయితే, ఈ చర్య ఆ ఆహార పదార్థాలను నిషేధించడం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సమోసాలు, జిలేబీలు వంటివి ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
మనం ఏ రకమైన ఆహారం తింటున్నది ప్రజలకు తెలిసేలా ఈ హెచ్చరిక బోర్డులు మాత్రం ఉంటాయని వివరణ ఇచ్చింది. ఈ ఆహారాలను పరిమిత స్థాయిలో తినాలన్న అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ పోస్టర్లు ఒక రిమైండర్‌గా పని చేస్తాయని, ముఖ్యంగా ఇటువంటి వస్తువులను తరచుగా తినే ప్రదేశాల్లో ప్రజలు మెరుగైన ఆహార ఎంపికలు చేసుకోవడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఎందుకీ వార్నింగ్ లేబుల్స్..? ..
“ఊబకాయం, డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బుల కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. బాగా వేయించిన ఆహార పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 5 మంది వృద్ధులలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు.
సరైన ఆహారం తీసుకోకపోవడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఫుడ్‌ను , స్నాక్స్‌ను తీసుకుంటున్నామో తెలిస్తే తినడానికి సంకోచిస్తారని ..దీని వల్ల ఒబెసిటీ, డయాబెటిస్, వంటి వాటికి దూరంగా ఉండొచ్చని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.