Delhi: ప్రియురాలే హంతకురాలు.. ఢిల్లీ సివిల్ విద్యార్థి హత్య కేసు
Delhi: ఒక ఫ్లాట్ లో కాలిన మృతదేహం లభించడంతో విచారించగా సివిల్స్‌కు సిద్ధమవుతున్న రామ్ కేశ్ మీనాగా గుర్తించారు.
Delhi
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో సంచలనం సృష్టించిన సివిల్స్ అభ్యర్థి హత్య కేసు మిస్టరీ వీడింది. అతని ప్రియురాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 6న తిమార్పూర్ గాంధీ విహార్ దగ్గర ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు.
ఒక ఫ్లాట్ లో కాలిన మృతదేహం లభించడంతో విచారించగా సివిల్స్‌కు సిద్ధమవుతున్న రామ్ కేశ్ మీనాగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. అగ్నిప్రమాదం జరిగిన తీరు కూడా అనుమానాలకు తావివ్వడంతో బిల్డింగ్ తో పాటు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు.
ప్రమాదం జరిగిన (Delhi)బిల్డింగ్ వద్ద సీసీటీవీ ఫుటేజీలో కీలక ఆధారాలు దొరికాయి. ఘటన జరిగిన రోజు రాత్రి మొహాలకు మాస్క్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. కొద్దిసేపటికి ఒకరు తిరిగి వెళ్ళిపోవడం, తర్వాత యువకుడు, యువతి తచ్చాడడం వంటివి ఫుటేజ్ లో ఉన్నాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు యువతిని మృతుడి ప్రియురాలు అమృతగా గుర్తించారు. కొంతకాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

రామ్ కేశ్ మీనా, అమృతతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని వీడియోలు రికార్డ్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ఈ వీడియోలు డిలీట్ చేయాలని కోరినా రామ్ కేశ్ మీనా నిరాకరించడంతో ఘటన జరిగిన రోజు పెద్ద గొడవ జరిగింది. దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్న అమృత తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్ తో కలిసి ప్లాన్ చేసింది. ఈ మర్టర్ ప్లాన్ లో సుమిత్ స్నేహితుడు సందీప్ కుమార్ కూడా సహకరించాడు.
ఫోరెన్సిక్ స్టూడెంట్ అయిన అమృత క్రైమ్ వెబ్ సిరీస్ లు చూసి హత్యకు ప్లాన్ చేసింది. గ్యాస్ సిలిండర్ పేల్చి ప్రమాదవశాస్తూ చనిపోయాడని నమ్మించాలని ప్రయత్నించింది. ఘటనకు కొద్ది సేపటి ముందు సుమిత్, సందీప్ కుమార్ ఇద్దరూ వెళ్ళి ఫ్లాట్ లో ఉన్న రామ్ కేశ్ మీనాను గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత హార్డ్ డిస్క్ ఉన్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు తీసుకున్నారు. కిచెన్ లో ఉన్న గ్యాస్ సిలింటర్ రామ్ కేశ్ మీనా మృతదేహం దగ్గరకు తీసుకొచ్చి గ్యాస్ లీక్ చేసారు.
లైటర్ విసిరేసి బయట లాక్ చేసి వెళ్లిపోగా.. కాసేపటికి సిలిండర్ పేలిపోయిందని పోలీసులు తెలిపారు. కేసును తప్పుదోవ పట్టించడానికి నిందితులు ముగ్గురు తీవ్రంగా ప్రయత్నించినా టెక్నికల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొరికిపోయారని పోలీసులు తెలిపారు. అమృతతో పాటు సుమిత్ , సందీప్ లను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.



