Akhanda 2:అఖండ 2కు చివరి నిమిషంలో షాక్.. హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు
Akhanda 2: టికెట్ ధరల పెంపు కారణంగా సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడుతోందని, ఈ విధంగా పెంపునకు అనుమతించే జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
Akhanda 2
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2′(Akhanda 2) సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతున్న వేళ, చిత్ర యూనిట్‌కు చివరి నిమిషంలో ఒక ముఖ్యమైన న్యాయపరమైన సవాలు ఎదురైంది.
ఓ వైపు నిర్మాతలు , అభిమానులు సినిమా విడుదల సన్నాహాల్లో బిజీగా ఉండగా ..అదే సమయంలో, ‘అఖండ 2′(Akhanda 2) సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలవడం మూవీ యూనిట్‌కు షాక్ తగిలినట్లు అయింది.

భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టుబడిని తిరిగి పొందడంలో సహాయపడటానికి, రాష్ట్ర ప్రభుత్వం తరచుగా సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచడానికి , ప్రత్యేక షోలను (బెనిఫిట్ షోలు) నిర్వహించడానికి అనుమతిస్తూ జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేస్తుంది. ‘అఖండ 2’ విషయంలోనూ అదే జరిగింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. టికెట్ ధరల పెంపు కారణంగా సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడుతోందని, ఈ విధంగా పెంపునకు అనుమతించే జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.

హైకోర్టు ఈ లంచ్ మోషన్‌ను విచారణకు స్వీకరించింది. దీనితో పాటు, ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లుబాటుపై మరియు ప్రత్యేక షోల నిర్వహణపై న్యాయస్థానం త్వరలో విచారణ జరపనుంది.
సినిమా విడుదలకు ముందు చివరి నిమిషంలో ఎదురైన ఈ న్యాయపరమైన ఆటంకం నిర్మాతలకు ఆందోళన కలిగించే అంశం. కోర్టు తీర్పు టికెట్ ధరల పెంపును నిలిపివేస్తే, మొదటి రోజు భారీ వసూళ్ల అంచనాలపై అది నేరుగా ప్రభావం చూపిస్తుంది. అయినా కూడా, చిత్ర యూనిట్ న్యాయస్థానం నిర్ణయాన్ని గౌరవిస్తూ, అనుకున్న సమయానికి సినిమా విడుదలకు సంబంధించిన మిగిలిన ఏర్పాట్లను కొనసాగిస్తోంది.



