Elon Musk: ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రికార్డు..ఈసారి ఏకంగా..
Elon Musk: ప్రస్తుతం ఎలాన్ మస్క్ వ్యాపారాలు అంతరిక్ష పరిశోధనల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, సోషల్ మీడియా నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు విస్తరించి ఉన్నాయి.
Elon Musk
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే ఎలాన్ మస్క్(Elon Musk), తాజాగా ఒక అసాధారణమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే 600 బిలియన్ డాలర్ల సంపదను సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.
ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ ఏకంగా 677 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోని కొన్ని దేశాల మొత్తం ఆదాయం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం.
మస్క్(Elon Musk) సంపద ఇంత వేగంగా పెరగడానికి ఆయన ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ ఐపీఓ (IPO) విలువ భారీగా పెరగడం మస్క్ ఆస్తులను ఒక్కసారిగా పెంచేసింది.

కేవలం ఐదేళ్ల కాలంలోనే ఆయన సంపద 24 బిలియన్ డాలర్ల నుంచి 600 బిలియన్ డాలర్లు దాటిపోవడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. స్పేస్ ఎక్స్ లో మస్క్ కు 42 శాతం వాటా ఉండగా, టెస్లాలో 12 శాతం, ఆయన కొత్తగా పెట్టిన ఎక్స్ఏఐ (xAI) సంస్థలో 53 శాతం వాటాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన వ్యాపారాలు అంతరిక్ష పరిశోధనల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, సోషల్ మీడియా నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు విస్తరించి ఉన్నాయి.
రాబోయే రోజుల్లో స్పేస్ ఎక్స్ ఐపీఓ ద్వారా ఆయన సంపద మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం మస్క్ సత్తాకు నిదర్శనం.



