IND vs NZ : ఇండోర్ లో గెలిచేదెవరు ?..సిరీస్ డిసైడర్ కు భారత్, కివీస్ రెడీ
IND vs NZ : ఇండోర్ వేదికగా ఇరు జట్లు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో తలపడబోతున్నాయి
IND vs NZ
భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య రసవత్తరంగా సాగుతున్న వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. తొలి వన్డేలో భారత్ గెలిస్తే… రెండో వన్డేలో న్యూజిలాండ్ పుంజుకుని సిరీస్ సమం చేసింది. ఇప్పుడు ఇండోర్ వేదికగా ఇరు జట్లు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో తలపడబోతున్నాయి. తొలి వన్డేలో భారత్ గెలిచినప్పటకీ బౌలింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. నిజం చెప్పాలంటే పేలవంగానే ఉంది. రెండో వన్డేలో ఇదే తరహా బౌలింగ్ కారణంగానే భారత్ ఓడిపోయింది.
ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. సొంతగడ్డపై మన జట్టు నుంచి ఇలాంటి బౌలింగ్ కనిపించడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈ తరహా బౌలింగ్ విజయాలు ఆశించడం ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. పవర్ ప్లేలోనూ వికెట్లు తీయలేక.. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేక.. చివర్లో స్లాగ్ ఓవర్లలో సైతం పరుగులు ఇచ్చేస్తున్నారు. దీంతో బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ ఇంతేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న సిరాజ్ తేలిపోతున్నాడు. అలాగే హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ సైతం ప్రభావం చూపించలేకపోయారు. అటు స్పిన్నర్లు సైతం విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్న మూడో వన్డేలో బౌలర్లు గాడిన పడితే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టమే.
మరోవైపు బ్యాటింగ్ లో గిల్ ఫామ్ అందుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ మాత్రం గత సౌతాఫ్రికా సిరీస్ ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. రెండు మ్యాచ్ లలోనూ రోహిత్ పెద్దగా స్కోర్లు చేయలేదు. దీంతో సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లోనైనా అతను చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే తొలి వన్డేలో సెంచరీ చేజార్చుకున్న విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచ్ లో నిరాశపరిచాడు.

రోహిత్ తో పాటు కోహ్లీ కూడా రెచ్చిపోతే ఇక కివీస్ బౌలర్లకు చుక్కలేదు. అటు కేఎల్ రాహుల్ సెంచరీతో ఫామ్ లోకి రాగా నితీశ్ రెడ్డికి ఈ మ్యాచ్ లో అవకాశం ఇస్తారా లేదా అనేది అనుమానమే. గంభీర్ కు ప్రియమైన ఆయుశ్ బదోనిని ఆడించే అవకాశాలున్నాయి. అలాగే రవీంద్ర జడేజా నుంచి కూడా భారత్ మ్యాచ్ గెలిపించే ప్రదర్శన ఆశిస్తోంది. అటు బౌలింగ్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఫెయిలైన ప్రసిద్ధ కృష్ణపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు తొలి వన్డేలో ఓడినా తర్వాత దెబ్బకు దెబ్బ కొట్టి సిరీస్ సమం చేసిన న్యూజిలాండ్ (IND vs NZ) ఫుల్ జోష్ లో ఉంది. గత మ్యాచ్ లోనూ ఆరంభంలోనే 2 వికెట్లు చేజార్చుకున్నప్పటకీ విల్ యంగ్, డారిల్ మిఛెల్ అదరగొట్టారు. ముఖ్యంగా మిఛెల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే భారీస్కోరు ఖాయం. ఇక పిచ్ విషయానికొస్తే ఇండోర్ లో బ్యాటర్లు పండగ చేసుకునే అవకాశముంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ వైపే మొగ్గుచూపొచ్చు.
T20 World Cup : టీ20 జట్టులోకి శ్రేయాస్..గిల్ ను పట్టించుకోని బీసీసీఐ




One Comment