Municipal Election:మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50% మేయర్ స్థానాలు
Municipal Election: జీహెచ్ఎంసీ, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ స్థానాలు మహిళా జనరల్ కోటాలోకి రాగా, మహబూబ్‌నగర్ మేయర్ స్థానాన్ని మాత్రం బీసీ మహిళకు కేటాయించారు.
Municipal Elections
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలోని 10 మున్సిపల్ ఎన్నికల (Municipal) కార్పొరేషన్లు , 121 మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్ , చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికల్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ 10 కార్పొరేషన్ మేయర్ స్థానాల్లో సగం అంటే 5 స్థానాలను మహిళలకే కేటాయించారు. ఇందులో జీహెచ్ఎంసీ, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ స్థానాలు మహిళా జనరల్ కోటాలోకి రాగా, మహబూబ్‌నగర్ మేయర్ స్థానాన్ని మాత్రం బీసీ మహిళకు కేటాయించారు.
అలాగే మిగిలిన కార్పొరేషన్లలో కొత్తగూడెం ఎస్టీ జనరల్‌కు, రామగుండం ఎస్సీ జనరల్‌కు కేటాయించబడ్డాయి. ఇక మంచిర్యాల , కరీంనగర్ కార్పొరేషన్లు బీసీ జనరల్ కోటాలోకి వెళ్లగా, గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానం జనరల్ అభ్యర్థులకు అందుబాటులో ఉంది.
మున్సిపాలిటీల విషయానికి వస్తే మొత్తం 121 చైర్మన్ స్థానాల్లో.. సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశారు. దీనిలో ఎస్సీలకు 17 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు , బీసీలకు 38 స్థానాలను రిజర్వ్ చేశారు. మిగిలిన 61 స్థానాలు జనరల్ కేటగిరీ కింద ఉన్నాయి. ప్రభుత్వం అనుసరించిన రూరల్-అర్బన్ పాపులేషన్ రేషియో ఫార్ములా ప్రకారం ఈ కేటాయింపులు జరిగాయి.

ఇప్పటికే తెలంగాణలో 2400 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 2025 నాటికి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావడంతో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణకు సర్వం సిద్ధమైంది.తలెంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 75 రకాల గుర్తులను గెజిట్‌లో విడుదల చేసింది. దీనిలో గుర్తింపు పొందిన పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రత్యేక గుర్తులను కూడా కేటాయించారు.
రాజకీయ పార్టీల వ్యూహాలు చూస్తుంటే ఈ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) రసవత్తరంగా సాగేలా కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని తమ విజయంగా చెప్పుకుంటోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తమ పట్టున్న పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటాలని చూస్తోంది. వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో బీఆర్ఎస్ బలంగా ఉండటంతో అక్కడి మేయర్ స్థానాలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ కూడా గ్రేటర్ వరంగల్ వంటి జనరల్ స్థానాల్లో సత్తా చాటాలని భావిస్తోంది.

ఎన్నికల టైమ్‌లైన్ ప్రకారం జనవరిలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, ఫిబ్రవరి మొదటి వారంలోనే ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మార్చి మొదటి వారంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువు తీరబోతున్నాయి. మొత్తానికి మహిళా అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. దీని ద్వారా రాబోయే ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారబోతున్నాయి.
Dhanushkodi:ధనుష్కోడి ..అంతమైన చోట మొదలయ్యే అద్భుతాన్ని చూడండి



