just AnalysisJust PoliticalJust TelanganaLatest News

Women Voters:మున్సిపల్ కురుక్షేత్రంలో మహిళా ఓటర్లదే ఫైనల్ కాల్.. ఈ పోరులో గెలుపెవరిది?

Women Voters: రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల నమ్మకం విషయానికి వస్తే వారిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Women Voters

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రం ఇప్పుడు ఒక త్రిముఖ పోరులా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో విశ్లేషిస్తే ఇది ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌ల మధ్య సవాల్‌గా మారుతోంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఇది మనుగడ ప్రశ్నగా మారింది. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఇప్పుడు ఏ పార్టీ గెలుపునైనా శాసించే శక్తి ఇప్పుడు మహిళా ఓటర్ల (Women Voters) చేతుల్లోనే ఉంది. తెలంగాణలోని మొత్తం 52 లక్షల పైచిలుకు ఓటర్లలో 51 శాతానికి పైగా మహిళలే ఉండటం, వారు ఎటు మొగ్గు చూపితే విజయం ఆ పార్టీనే వరిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లలో 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు (Women Voters) ఉండగా, పురుష ఓటర్లు 25.62 లక్షలు మాత్రమే ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలు సుమారు 1.17 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. దాదాపు ప్రతి మున్సిపాలిటీ , కార్పొరేషన్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల నమ్మకం విషయానికి వస్తే వారిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ , మహిళా షగన్ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన పునాదిని వేశాయి. ముఖ్యంగా గ్రామీణ , పట్టణ పేద మహిళలు ఈ పథకాల పట్ల సానుకూలంగా ఉన్నారు.

అయితే, నిరుద్యోగ యువతలో మాత్రం రేవంత్ సర్కార్‌పై కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీలో జాప్యం, ఇచ్చిన హామీల అమలులో ఉన్న అడ్డంకులు కాంగ్రెస్‌కు కొంత ప్రతికూలంగా మారొచ్చు. అయినా సరే, అధికారంలో ఉండటం , సంక్షేమ పథకాలు నేరుగా మహిళల ఖాతాల్లోకి చేరుతుండటం వల్ల కాంగ్రెస్ ఇప్పటికీ స్లైట్ ఎడ్జ్‌లో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటు పదేళ్ల పాలనలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, పార్కులు, తాగునీరు) బీఆర్ఎస్ హయాంలోనే వేగవంతమైందని ఒక వర్గం ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. కేటీఆర్, హరీష్ రావు అర్బన్ ఓటర్లలో ఉన్న క్రేజ్ ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

మరోవైపు, బీజేపీ తన వ్యూహాన్ని చాలా స్పష్టంగా అమలు చేస్తోంది. కేవలం కేంద్ర నిధులు , మోదీ నామస్మరణతోనే కాకుండా, ‘పన్నా ప్రముఖ్’ అనే పకడ్బందీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేరుతోంది. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఓటర్లు, ముఖ్యంగా విద్యావంతులైన యువత బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

Women Voters
Women Voters

అమృత్ పథకం కింద అందుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు, డ్రైనేజీ , తాగునీటి ప్రాజెక్టుల ప్రచారం ఆ పార్టీకి పట్టణాల్లో బలాన్ని ఇస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి. కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు దీటుగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయితే, మున్సిపాలిటీల్లో ఆ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని మరికొందరు అంటున్నారు.

ఇక బీఆర్ఎస్ పరిస్థితిని గమనిస్తే, ఆ పార్టీపై సానుభూతి కంటే కూడా కేడర్ నిలబడుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. కట్రెవల్ వంటి లాయలిస్ట్ ఓటర్లు ఇంకా పార్టీతోనే ఉన్నా సరే, సాధారణ ఓటర్లు మాత్రం కొత్త ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కేటీఆర్ ఇమేజ్‌కు జరిగిన డ్యామేజ్ అధికారంలో లేకపోవడం వల్ల నిధుల కొరత బీఆర్ఎస్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. అయితే, హైదరాబాద్ వంటి నగరాల్లో బీఆర్ఎస్‌కు ఉన్న పట్టును తక్కువ అంచనా వేయలేం. కాంగ్రెస్ , బీజేపీల మధ్య ఓట్లు చీలితే, అది బీఆర్ఎస్‌కు లాభించే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.

చివరిగా చెప్పాలంటే, ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే (Women Voters)అసలైన ‘గేమ్ చేంజర్స్’. ఎవరైతే మహిళలకు భద్రత, ఆర్థిక భరోసాతో పాటు మౌలిక సదుపాయాల విషయంలో గట్టి నమ్మకాన్ని కలిగిస్తారో వారికే పట్టం కట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు.

కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో మహిళల మనసు గెలుచుకోవాలని చూస్తుంటే, బీజేపీ అభివృద్ధి . కేంద్ర నిధులతో ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు కాంగ్రెస్‌కు మెజారిటీ మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉన్నా,బీఆర్ఎస్ దానికి చాలా దగ్గరగా పోటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సంఖ్యాపరంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల వారు ఏ పార్టీ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపినా, ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుందనేది విశ్లేషకుల మాట.

Casting Couch:సినిమా గ్లామర్ వెనుక కాస్టింగ్ కౌచ్ కోరలు..అసలు దీనికి ముగింపు లేదా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button