AI:మున్సిపల్ ఎన్నికల ఓట్ల వేటలో ఏఐ హవా.. మీ జేబులోని డేటానే ఇప్పుడు రాజకీయ ఆయుధంగా మారనుందా?
AI: అభ్యర్థి గొంతును ఏఐ ద్వారా క్లోన్ చేసి వేల మందికి ఒకేసారి పంపించడానికి రెడీ చేస్తున్నారు.
AI
ఎన్నికల ప్రచారం అంటే ఒకప్పుడు మైకులు,వాల్ పోస్టర్లు,ఇంటింటికీ తిరిగి ఓట్లు అడగడం ఉండేవి. కానీ 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ తమ అభ్యర్థి విజయం కోసం గల్లీల్లో తిరగడమే కాదు, గూగుల్ , సోషల్ మీడియా అల్గారిథమ్స్‌తో కుస్తీ పడుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలు ఈసారి ఎలక్షన్ రిజల్ట్‌ను తలకిందులు చేసేలా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే..మీరు ఫోన్‌లో ఏం చూస్తున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనే డేటా ఆధారంగా.. మీ ఇంటి తలుపు ఏ పార్టీ వారు తట్టాలో డిసైడ్ అవుతోంది.
ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలా డేటా సైంటిస్టులను రంగంలోకి దించింది. పాత ఎన్నికల ఫలితాలు, మీ ఏరియాలో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు, కుల సమీకరణలు.. ఇలా ప్రతి అంశాన్ని డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్లలో విశ్లేషిస్తున్నారు.
ఉదాహరణకు, మీరు మీ ఏరియాలో నీటి సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, వెంటనే మీ ఫోన్‌కు ఒక పార్టీ నుంచి మాకు ఓటేస్తే అన్ని సమస్యలు తీరుస్తామని చెబుతూ ఓ మెసేజ్ లేదా ఏఐ కాల్ వస్తుంది. దీనినే మైక్రో టార్గెటింగ్ అంటారు. అంటే ఓటరు మనస్తత్వాన్ని బట్టి వారికి ఏ వార్త చెబితే ఓటు వేస్తారో ఆ సాఫ్ట్‌వేర్లు అభ్యర్థులకు ముందే చెప్పేస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో ఏఐ(AI) వాయిస్ క్లోనింగ్ ఒక అద్భుతమైన, ప్రమాదకరమైన ఆయుధంగా మారింది. మీ నియోజకవర్గ అభ్యర్థి మీ పేరు పెట్టి పిలుస్తూ, మీ వీధిలోని సమస్య గురించి మాట్లాడుతూ నేరుగా ఫోన్ కాల్ చేసినట్లుగానే అనిపిస్తుంది. కానీ అది నిజమైన కాల్ కాదు, అభ్యర్థి గొంతును ఏఐ ద్వారా క్లోన్ చేసి వేల మందికి ఒకేసారి పంపించడానికి రెడీ చేస్తున్నారు. ఇది ఓటర్లలో అభ్యర్థికి నా గురించి బాగా తెలుసనే భావన కలిగిస్తోంది.
మరోవైపు, డీప్‌ఫేక్ వీడియోలు కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ నాయకులు అనని మాటలను అన్నట్లుగా, చేయని పనులను చేసినట్లుగా ఏఐ వీడియోలు క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో వదలడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. వీటిని అరికట్టడానికి ఈసీ కూడా ఏఐ లేబులింగ్ ను స్ట్రిక్ట్‌గా చేసింది.

ముఖ్యంగా బీజేపీ పన్నా ప్రముఖ్ వ్యవస్థను ఇప్పుడు డిజిటల్ పన్నా ప్రముఖ్ గా మార్చింది. ప్రతి బూత్ స్థాయిలో ఏ ఏ ఓటర్లు తమకు అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో రియల్ టైమ్ డేటా ద్వారా ట్రాక్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మహిళా స్వయం సహాయక బృందాల డేటాను విశ్లేషిస్తూ, సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులకు టార్గెటెడ్ మెసేజ్‌లు పంపుతోంది.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గ్రాఫిక్స్ , ఏఐ విజువల్స్ ద్వారా ప్రజలకు చూపిస్తూ, అర్బన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. చాట్‌బాట్‌ల ద్వారా ఓటర్ల సందేహాలను తీర్చడం, ఏఐ జెనరేటెడ్ సాంగ్స్ , స్లోగన్స్ ఈసారి ప్రచారంలో హైలైట్‌గా నిలుస్తున్నాయి.
టెక్నాలజీ మనకు సమాచారాన్ని అందిస్తుంది కానీ,అది నిజమా కాదా అని తేల్చుకోవాల్సిన బాధ్యత మనదే. మీ ఫోన్‌కు వచ్చే ప్రతి వీడియోను, కాల్‌ను గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వచ్చే డీప్‌ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏఐ కంటెంట్‌కు కచ్చితంగా ఏఐ జనరేటెడ్ (AI Generated)అనే ట్యాగ్ ఉండాలి. అది లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. డిజిటల్ మాయాజాలంలో పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
Women Voters:మున్సిపల్ కురుక్షేత్రంలో మహిళా ఓటర్లదే ఫైనల్ కాల్.. ఈ పోరులో గెలుపెవరిది?



