Just SportsLatest News

T20 : న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో..విశాఖలో భారత్ కు షాక్

T20 : న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో కనబరచడంతో విశాఖ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో భారత్ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది

T20

టీ ట్వంటీ(T20) సిరీస్ లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో కనబరచడంతో విశాఖ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీ(T20)లో భారత్ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

తుది జట్టులో ఇషాన్ కిషన్ ను తప్పించి అర్షదీప్ ను తీసుకుంది. బ్యాటింగ్ డెప్త్ కంటే కూడా బౌలింగ్ మరింత మెరుగ్గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో పరువు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆడింది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు కాన్వే, సిఫెర్ట్ దుమ్మురేపారు. భారీ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది.

తర్వాత కూడా మరింత దూకుడుగా ఆడిన వీరిద్దరూ తొలి వికెట్ కు 8.2 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కాన్వే 23 బంతుల్లో 44 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా… రచిన్ రవీంద్ర కూడా వెంటనే ఔటయ్యాడు. కాసేపటికే సిఫెర్ట్ 36 బంతుల్లో 62 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవడంతో కివీస్ జోరుకు బ్రేక్ పడినట్టు కనిపించింది. అయితే గ్లెన్ ఫిలిప్స్ (24), డారిల్ మిఛెల్ (39 నాటౌట్ ) దూకుడుగా ఆడడంతో స్కోర్ 200 దాటింది. మిఛెల్ తన ఫామ్ కొనసాగిస్తూ 18 బంతుల్లో 39 (2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ 2 , కుల్దీప్ యాదవ్ 2 , బిష్ణోయ్ , బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యఛేదనలో భారత్ కు తొలి బంతికే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. రెండో ఓవర్లోనే సూర్యకుమార్ యాదవ్ కూడా ఔటవగా.. ఇక్కడ నుంచి భారత్ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో సంజూ శాంసన్, రింకూ సింగ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కనిపించిన సంజూ కొన్ని షాట్లతో ఆకట్టుకున్నాడు.

T20
T20

అయితే కీలక సమయంలో వెనుదిరిగాడు. సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 (3 ఫోర్లు, 1 సిక్స్ ) పరుగులు చేయగా.. రింకూ సింగ్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో 39 రన్స్ కు ఔటయ్యాడు. హార్థిక్ పాండ్యా కూడా ఔటవడంతో భారత్ కథ ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. అయితే శివమ్ దూబే ఒంటరి పోరాటంతో ఆశలు రేకెత్తాయి. కివీస్ బౌలర్లను చితక్కొట్టిన దూబే కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

దూబే క్రీజులో ఉన్నంత సేపు అభిమానులు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న దూబే చివరికి 15వ ఓవర్ చివరి బంతికి ఔటవడంతో భారత్ కథ ముగిసినట్టయింది. తర్వాత టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమిండియా 165 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో కెప్టెన్ శాంట్నర్ 3 , డఫీ 2, సోధి 2 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ భారత్ ఆధిక్యాన్ని 1-3కు తగ్గించగలిగింది. సిరీస్ చివరి టీ20(T20) శనివారం తిరువనంతపురంలో జరుగుతుంది.

Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button