Bharat Bandh:రేపే భారత్ బంద్.. ఎందుకు? ఏ సేవలు బంద్?
Bharat Bandh: గతేడాది కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు ఈ వివాదానికి ప్రధాన కేంద్రబిందువుగా మారాయి.
Bharat Bandh
రేపు అంటే ఫిబ్రవరి 12, 2026 గురువారం రోజు దేశవ్యాప్తంగా ఒకేసారి నిరసన జ్వాలలు ఎగిసిపడబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చాయి.
ఈ భారీ ఆందోళనకు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గతేడాది కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు ఈ వివాదానికి ప్రధాన కేంద్రబిందువుగా మారాయి.
29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసిన కేంద్రం.. వీటిని తీసుకురావడం వల్ల కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని, ఉద్యోగ భద్రత తగ్గుతుందని కార్మిక యూనియన్లు ఆరోపిస్తున్నాయి. కంపెనీ యజమానులు తమకు నచ్చినప్పుడు ఉద్యోగులను తొలగించేలా ఈ చట్టాలు ఉన్నాయని వారి ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ భారత్ బంద్(Bharat Bandh)లో రైతు సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల భారత్ , అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ తమ పాలిట శాపంగా మారుతుందని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు తగ్గించడం వల్ల.. మన దేశీయ మార్కెట్లో ధరలు పడిపోయి రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు.
అలాగే ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కంటెన్యూ చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు వంటి వాటిని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ వంటి సుమారు 10 ప్రధాన సంఘాలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా వీధుల్లోకి రానుండటంతో.. దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఈ భారత్ బంద్ (Bharat Bandh) వల్ల రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సేవలు ప్రభావితం కానున్నాయి. కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా కొంత అంతరాయం కలగొచ్చు. ఆసుపత్రులు, అంబులెన్సులు, మందుల షాపులు వంటి అత్యవసర సేవలు మాత్రం ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.
విమానశ్రయాలు , రైల్వేలు నడుస్తున్నా, ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షణ్లు, నిరసనల వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవాళ్లు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. అయితే కేంద్రం పట్ల తమ అసమ్మతిని చాటడానికి కార్మికులు, రైతులు సిద్ధమైన ఈ బంద్‌లో రేపు అందరి దగ్గర నుంచి ఎలాంటి స్పందిస్తుందో చూడాలి.



