Just LifestyleHealthLatest News

Multitasking:మల్టీ టాస్కింగ్..మెదడును షార్ప్ చేస్తుందా? మొద్దు బారుస్తుందా?

Multitasking:మనం ఏదైనా ఒక విషయాన్ని లోతుగా ఆలోచించడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి మెదడుకు ప్రశాంతత, ఏకధాటిగా సాగే ఏకాగ్రత అవసరం పడుతుంది.

Multitasking

ఇప్పుడు అందరం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ పరుగులు పెడుతూనే పనులు చేసుకుంటున్నాం. ఒకే సమయంలో చాలా పనులు పూర్తి చేయడాన్ని ఒక గొప్ప నైపుణ్యంగా.. తెలివితేటలకు నిదర్శనంగా భావిస్తున్నాం. దీనినే మనం గొప్పగా మల్టీ టాస్కింగ్(Multitasking) అని పిలుచుకుంటున్నాం. ఒక పని చేస్తూనే ఇంకో పనిలో కూడా వేలు పెడుతూ అన్ని పనులు పూర్తి చేస్తున్నామని గర్వంగా ఫీలవుతున్నాం. ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది.

అయితే శాస్త్రీయ దృక్పథంతో చూస్తే కనుక.. మనిషి మెదడు నిజంగా మల్టీ టాస్కింగ్(Multitasking) చేయడానికి అనువుగా నిర్మించబడలేదని తేలింది. మనం ఒకేసారి రెండు పనులు చేస్తున్నప్పుడు.. మనిషి మెదడు ఆ రెండు పనుల మధ్య అత్యంత వేగంగా అటు ఇటు మారుతూ (Switching) ఉంటుంది తప్ప, రెండింటినీ ఒకేసారి ప్రాసెస్ చేయలేదు. అందుకే ఇలాంటి సమయంలో మెదడుపై విపరీతమైన భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మనం పనులను ఇలా పదేపదే మారుస్తూ చేయడం వల్ల మన పని సామర్థ్యం సుమారు 40 శాతం వరకు తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మెదడులో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మనల్ని త్వరగా అలసిపోయేలా చేయడంతో పాటు..మన ఆలోచనా శక్తిని మందగింపజేస్తుంది.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనంలో మల్టీ టాస్కింగ్ చేసే వారిలో.. ఐక్యూ (IQ) స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయని తేలింది. ముఖ్యంగా ఏకాగ్రత అనేది ఇలా పార్టులు పార్టులుగా విడిపోవడం వల్ల మనం చేసే పనిలో నాణ్యత లోపిస్తుంది. మనం ఏదైనా ఒక విషయాన్ని లోతుగా ఆలోచించడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి మెదడుకు ప్రశాంతత, ఏకధాటిగా సాగే ఏకాగ్రత అవసరం పడుతుంది. కానీ మల్టీ టాస్కింగ్ వల్ల ఆ అవకాశం లేకుండా పోతోంది.

Multitasking
Multitasking

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా నోటిఫికేషన్లు మనల్ని కంటిన్యూగా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. దీనివల్ల మన మెదడు లోతుగా ఆలోచించడానికి ఇష్టపడకుండా ..షాలో థింకింగ్ లేదా పైపైన ఆలోచించే విధానానికి అలవాటు పడిపోతోంది. ఇది దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తిపైన కూడా ప్రభావం చూపిస్తుంది.

దీనికి తోడు ఒక పనిని పూర్తి చేయకుండానే మరో పనికి మారడం వల్ల మనలో పూర్తి సంతృప్తి రాదు. దీనికి తోడు ఏదో తెలియని టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేధావులంతా సింగిల్ టాస్కింగ్, డీప్ వర్క్ చేయాలని సూచిస్తున్నారు. అంటే ఒక సమయంలో ఒకే పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల పని వేగంగా పూర్తవ్వడంతో పాటు..మెదడుకు కూడా విశ్రాంతి దొరుకుతుంది. మనం తెలివైన వాళ్లమని నిరూపించుకోవడానికి మల్టీ టాస్కింగ్ అనే పేరులో బతకడం కంటే, చేసే పనిని శ్రద్ధగా చేయడం వల్లే అసలైన రిజల్ట్ దొరుకుతుందన్న విషయాన్ని గుర్తించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button