Latest News

BCCI : బీసీసీఐ మిషన్ వన్డే ప్రపంచకప్…20 మందితో ప్రాబబుల్స్ రెడీ

BCCI : 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం బీసీసీఐ ఏడాది ముందు నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది.

BCCI

గత రెండేళ్ళుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ క్రికెట్ జట్టు హవా కొనసాగుతోంది. 2024 టీ20 ప్రపంచకప్ నుంచీ టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరలేకపోయినా సరే వైట్ బాల్ టోర్నీల్లో మాత్రం దుమ్మురేపుతోంది. ఈ రెండేళ్లలో రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లు, ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. టెస్ట్ ఫార్మాట్ ను పక్కన పెడితే వన్డే ప్రపంచకప్ ను మాత్రం గెలిచి 14 ఏళ్లు దాటిపోతోంది.

2011లో సొంతగడ్డపై విశ్వవిజేతగా నిలిచిన భారత్ 2023లో ఫైనల్ వరకూ చేరినా తుది పోరులో చతికిలపడింది. ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం బీసీసీఐ(BCCI) ఏడాది ముందు నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా మిషన్ ప్రపంచకప్ కోసం ప్రాబబుల్స్ ను రెడీ చేసింది. 20 మందితో షార్ట్ లిస్ట్ ను సిద్ధం చేసిన బోర్డు వారి ఆటతీరును దగ్గరగా పర్యవేక్షించబోతోంది. ఈ బాధ్యతలను సెలక్టర్లకు అప్పగించింది.

అది కూడా ఈ ఐపీఎల్ నుంచే మొదలుకాబోతోంది. ఐపీఎల్ లో సెలక్టర్లు వారానికి కనీసం ఒక్క మ్యాచ్ నైనా స్టేడియానికి వెళ్లి చూసేలా ఆదేశాలిచ్చింది. జాబితాలో ఉన్న ఆటగాళ్ల ఆటతీరు, ఫిట్ నెస్ ను పరిశీలించి క్రమం తప్పకుండా బోర్డుకు నివేదికలు ఇవ్వడమే సెలక్టర్ల పని.

దీని ప్రకారం చూసుకుంటే ఈ ఐపీఎల్ స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కీలకం కానుంది. ఒక విధంగా వారి భవిష్యత్తును డిసైడ్ చేయబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే టెస్ట్, టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వీరిద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ కు ముందు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో వన్డే సిరీస్ లలో ఇద్దరూ అదరగొట్టారు.

BCCI
BCCI

తద్వారా 2027 వన్డే ప్రపంచకప్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. అయితే అప్పటి వరకూ ఇదే ఫామ్ కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే ఫిట్ నెస్ ను కూడా కాపాడుకుంటేనే సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు భారత పేస్ విభాగంపై బీసీసీఐ(BCCI) మరింత ఫోకస్ పెట్టింది.

బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ, హార్థిక్ పాండ్యాల బౌలింగ్ ను నిరంతరం ట్రాక్ చేయబోతోంది. గాయంతో దూరమైన హర్షిత్ రాణా ప్రస్తుతం కోలుకుంటుండగా.. మిగిలిన బౌలర్లు నిలకడగా రాణించి సెలక్టర్లను ఆకట్టుకోవాలి. అటు భారత్ జట్టులో మరికొందరిని బ్యాకప్ గా పరిశీలించాలని కూడా బోర్డు నిర్ణయించింది.

ఎందుకంటే మెగాటోర్నీకి ముందు ఎవరైనా గాయాల బారిన పడితే బ్యాకప్ గా ముందే కొందరిని సిద్ధంగా ఉంచుకోవాలి. మొత్తం మీద ఐపీఎల్ నుంచి వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముందు వరకూ 20 మంది ప్రాబబుల్స్ జాబితాలో ఎవరు మెగాటోర్నీకి ఎంపికవుతారనేది ఆసక్తికరంగా మారింది.

SL Cricket : ఫిట్ గా ఉంటేనే ఎన్ వోసీ..లంక క్రికెట్ బోర్డు నిర్ణయం

Related Articles

Back to top button