Rakasa : భయపెడుతూనే నవ్విస్తున్న రాకాస…నిహారికాకు మరో హిట్ ?
Rakasa : ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోన్న రాకాసతో నిహారిక ఖాతాలో మరో హిట్ ఖాయమని అంటున్నారు
Rakasa
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు… అలాగే మంచి కథ అయితే అది చిన్న హీరోనా, భారీ బడ్జెట్ తో తీసారా… పెద్ద బ్యానరా అనేది ప్రేక్షకులు చూడరు. కొత్తగా వస్తున్న హీరోలు, నిర్మాతల్లో కొందరు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అందుకే గత కొంతకాలంగా టాలీవుడ్ లో విభిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.
ఇదే ఫార్ములా ఫాలో అవుతున్న నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రాకాస అనే కొత్త చిత్రాన్ని నిర్మించింది. గతంలో కమిటీ కుర్రాళ్లు మూవీకి నిహారికానే నిర్మాత. ఇప్పుడు రెండో చిత్రాన్ని కూడా డిఫరెంట్ స్టోరీతో ప్రొడ్యూస్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
యువ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రాకాస మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. భయపెడుతూనే నవ్విస్తోన్న రాకాస ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హారర్ మాత్రమే కాకుండా ఫ్యాంటసీ , కామెడీని మిక్స్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఓ చిన్న ఊరు , కోట, అందులో క్రూరమైన రాక్షసుడు, రోజుకొకరు బలి..ఈ కాన్సెప్ట్ తోనే రాకాస మూవీ తెరరెక్కింది. ఆ రాక్షసుడు ఎవరూ.. ఆ కోట మిస్టరీ ఏంటనే పాయింట్లపైనే కథ రన్ అవుతుంది.
రాకాస(Rakasa)లో సంగీత్ శోభన్ హీరోగా నటించాడు. గతంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో యూత్ కు కనెక్ట్ అయిన సంగీత్ శోభన్ ఈ డిఫరెంట్ మూవీలో చాలా కూల్ గా నటించాడని అర్థమవుతోంది. లవర్ కోసం ఆ ఊరు వచ్చి సదరు రాక్షసుడి ఉచ్చులో చిక్కుకునే హీరో క్యారెక్టర్ అతనిది. బాగా పిరికివాడయిన హీరో ఆ రాక్షసుడిని ఎలా మట్టుపెట్టాడన్నది ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు మేకర్స్ చెబుతున్నారు.

సీనియర్ నటుడు బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని అంటున్నారు. ఖర్చు విషయంలో రాజీపడకుండా నిహారిక మంచి క్వాలిటీతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సినిమా విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్..భయాన్ని కలిగిస్తూనే నవ్విస్తూ కథలో లీనం చేసేలా ఉన్నాయి. కథలో కంటెంట్ ఉంటే భారీ ప్రాజెక్టులే చేయక్కర్లేదనీ, చిన్న సినిమాలతో మంచి హిట్టు కొట్టొచ్చని నమ్మిన నిహారిక రాకాస మూవీని నిర్మిస్తున్నట్టు చెబుతోంది.
ఈ కామెడీ థ్రిల్లర్ లో సంగీత్ శోభన్ కు జంటగా నయన్ సారిక నటించింది.. మానస శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో నటించిన నిహారిక.. కమిటీ కుర్రాళ్లు మూవీతో నిర్మాతగా మారింది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా రాకాసతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోన్న రాకాసతో నిహారిక ఖాతాలో మరో హిట్ ఖాయమని అంటున్నారు.





