Just EntertainmentLatest News

Asha Bhosle : దిగ్గజ గాయని ఆశా భోస్లే ఇకలేరు…సంగీత ప్రపంచం ఘన నివాళి

Asha Bhosle : బాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) అనారోగ్యంతో క‌న్నుమూసింది.

Asha Bhosle

భారత సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ గాయని, లతా మంగేష్కర్ సోదరి ఆశా భోస్లే(Asha Bhosle) ఇక లేరు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా కన్నుమూశారు. శనివారం ఆమెకు తీవ్ర అస్వస్థతకు లోనవగా కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.

ఆశా భోస్లే(Asha Bhosle) మృతి చెందడాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. దిగ్గజ గాయని పాడిన పాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఆశా భోస్లే మహారాష్ట్ర సాంగ్లిలోని గోర్ అనే చిన్న గ్రామంలో 1933 సెప్టెంబరు 8న జన్మించారు. పదేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రస్థానం మొదలైంది.

వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. సినిమా పాటలే కాదు, పాప్ మ్యూజిక్, గజల్స్, భజన పాటలతో పాటు జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో ఆమె ఎంతో పేరు గాంచారు. 20కి పైగా భారతీయ, విదేశీ భాషలలో ఆశా భోస్లే పాటలు పాడి అలరించారు. తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడారు. టాలీవుడ్ లో కేవలం 8 పాటలే పాడినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

1981లో ఇది మౌనగీతంతో తొలిసారి తెలుగు పాట పాడిన ఆమె 2007లో చందమామ సినిమాలోని నాలో ఊహలకు పాటతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. బాలకృష్ణ నటించిన ‘అశ్వమేథం’ సినిమాలో ఆశా భోస్లే పాడిన పాటలు ఎంతగానో అలరించాయి.

Asha Bhosle
Asha Bhosle

అమె మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు అభివర్ణించారు. దశాబ్దాలుగా ఆమె పాడిన పాటలు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రధాని మోదీ చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆశా బోస్లే మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు ఆశా బోస్లే మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా ఆశా భోస్లే భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పరేల్‌లోని ఆమె స్వగృహంలో ఉంచుతారు. అనంతరంసాయంత్రం 4 గంటలకు ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్‌లో పభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Mangli : డబ్బు ఇవ్వనందుకే నాపై ఆరోపణలు…మైక్రోఫైనాన్స్ స్కాంతో సంబంధం లేదన్న మంగ్లీ

Related Articles

Back to top button