Voters : తమిళనాడులో 85… బెంగాల్ లో 90 శాతం..రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు
Voters : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత ఆసక్తి నెలకొన్న తమిళనాట పోలింగ్ ముగిసింది. అటు బెంగాల్ లోనూ తొలి దశ పోలింగ్ కు తెరపడింది.
Voters
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత ఆసక్తి నెలకొన్న తమిళనాట పోలింగ్ ముగిసింది. అటు బెంగాల్ లోనూ తొలి దశ పోలింగ్ కు తెరపడింది. విశేషమేమిటంటే ఈ రెండు చోట్లా రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా తమిళనాడులో ఏకంగా 85 శాతం పోలింగ్ నమోదవడం ఆశ్చర్యపరుస్తోంది.
2021 కంటే ఇది దాదాపు 13 శాతం ఎక్కువ. నిజానికి ఈ స్థాయి ఓటింగ్ శాతం నమోదవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. తొలి నాలుగు గంటల్లోనే 37 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారంతా ఉత్సాహంగా వచ్చి దానిని వినియోగించుకున్నారు. గంటగంటకూ పోలింగ్ శాతం పెరుగుతూనే ఉంది. 6 గంటల వరకూ 84.29 శాతం మంది ఓటు వేసినట్టు ఈసీ తెలిపింది. అయితే పోలింగ్ సమయం ముగిసేసరికి ఇంకా చాలా మంది ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వారందరికీ ఓటు వేసే అవకాశం ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది.
ఇదిలా ఉంటే చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖులంతా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. అటు బెంగాల్ లో సైతం తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

అక్కడ కూడా రికార్డు స్థాయి ఓటింగ్ శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ దాదాపు 90 శాతం పోలింగ్ శాతం నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. బెంగాల్ లో తొలి దశకు సంబంధించి 152 స్థానాల్లో పోలింగ్ జరిగింది. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీకి కలిసొస్తుందనేది చూడాలి. ఈ 152 స్థానాల్లో 2021లో టీఏంసీ 93 చోట్ల విజయం సాధించగా.. బీజేపీ 59 చోట్ల మాత్రమే గెలవగలిగింది.
కాగా తమిళనాడులో దాదాపు 5.67 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. డీఏంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీ బరిలో నిలిచాయి. పెరిగిన ఓటింగ్ శాతంతో రాజకీయ పార్టీలకు టెన్షన్ మొదలైంది. సాధారణంగా అధికార పార్టీపై అసంతృప్తి ఉన్నప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది.
Tamil Nadu : ద్రవిడ గడ్డపై త్రిముఖ పోరు.. తమిళనాడులో పీఠం ఎవరిది?





