Love : వదులుకోలేనంత ప్రేమ.. పట్టనట్టు ఉండే మనస్తత్వం.. ఈ ద్వంద్వ వైఖరికి కారణాలేంటి?
Love : ప్రేమ అనేది ఒక అద్భుతమైన కావ్యం అయితే.. అందులో అపార్థాలు,తగాదాలు,కోపాలు, తాపాలు అనేవి ఊహించని మలుపులుగా కవులు చెబుతూ ఉంటారు
Love
ప్రేమ అనేది ఒక అద్భుతమైన కావ్యం అయితే.. అందులో అపార్థాలు,తగాదాలు,కోపాలు, తాపాలు అనేవి ఊహించని మలుపులుగా కవులు చెబుతూ ఉంటారు. కానీ, కొందరి ప్రవర్తన చూస్తుంటే అసలు ఇది ప్రేమే(Love)నా అన్న అనుమానం వస్తుంది. తరచూ నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేనని , నన్ను వదిలి ఉండకు అని పదే పదే చెప్పే వ్యక్తి.. ఒక చిన్న గొడవ జరిగిన వెంటనే అసలు అవతలివారు ఎవరో తెలియనట్టు, వారితో పనే లేనట్టు నిశ్శబ్దంగా మారిపోతుంటారు.
ఇలా బంధంలో ఒక చిన్న సమస్య రాగానే అపరిచితుడిలా మారిపోవడమనేది ఒక సైకలాజికల్ డిఫెన్స్ మెకానిజం. అంటే, తగాదా జరిగినప్పుడు కలిగే బాధ నుంచి లేదా ఆత్మన్యూనత నుంచి తనను తాను కాపాడుకోవడానికి అతను మౌనం అనే కోటను కావాలనే నిర్మించుకుంటాడు. అతను మంచివాడే అయినా.. ఆ సమయంలో అతనిలోని తెలియని ఈగో (Ego) అతని ప్రేమ కంటే బలంగా మారిపోతుంది. ఇదంతా అతను కావాలని చేయకపోయినా అతని అంతరంగంలో (Subconscious mind) ఉన్న అభద్రతా భావమే అతన్ని అలా నడిపిస్తుంది.
సైకాలజీ ప్రకారం, ఎప్పుడైనా తమ మధ్య గొడవ జరిగినప్పుడు ఇలాంటి వ్యక్తులు తాను తగ్గితే తన విలువ పడిపోతుందనో, లేదా అవతలి వాళ్లే వచ్చి తనను ప్లీజ్ చేయాలనే ధోరణిని కలిగి ఉంటారు. మామూలు సమయాల్లో అతను మిమ్మల్ని వదులుకోలేక తనను వదిలేయకని అన్నప్పుడు అతనిలోని అటాచ్మెంట్ కనిపిస్తుంది. కానీ గొడవ జరిగినప్పుడు పట్టనట్టు ఉండటంలో అతనిలోని పవర్ ప్లే కనిపిస్తుంది. అంటే ఒకే వ్యక్తిలో రెండు రకాల మనస్తత్వాలు దాచుకున్నట్లు అర్ధం.
అంతేకాదు ఇలాంటి వ్యక్తులు తమ పర్సనల్ బంధాల కంటే సమాజంలో తమకు ఉండే ఇమేజ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నలుగురిలో తన పేరు చెడిపోకూడదనే తాపత్రయంతో, తన మనిషిని కూడా పట్టించుకోకుండా బయటి వాళ్లను సంతోషపెట్టడానికి సిద్ధపడతారు. దీనినే ఫియర్-బేస్డ్ పీపుల్ ప్లీజింగ్ అంటారు.
అతని అసలు మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలంటే.. అతను మౌనంగా ఉన్నప్పుడు అది మీపై కోపం అని అనుకునే కంటే, తనను తాను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే అవతలి వ్యక్తి చూడాలి. అయితే ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని మానసిక నిపుణులు అంటున్నారు.

ఇలాంటి ప్రవర్తన వల్ల ఇద్దరి మధ్య తీరని అగాధం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఒక వ్యక్తిని ప్లీజ్ చేయడమనేది ఒక స్థాయి వరకు బాగుంటుంది, కానీ అదే పనిగా ప్రతిసారీ ఒకరే తగ్గాల్సి వస్తే.. ఆ బంధంలో గౌరవం, ప్రేమ, ఇష్టం చచ్చిపోతాయి. తను మంచివాడే కదా అని భరిస్తూ ఉంటే, అది అతనిలో ఈ రకమైన ప్రవర్తనను మరింత పెంచుతుంది తప్ప అతనిలో రావాల్సిన మార్పు రాదు.
ఇలాంటి వారిలో మార్పు రావాలంటే, అతను తన మౌనం ద్వారా మిమ్మల్ని మానసిక హింసకు గురి చేస్తున్నాడన్న విషయాన్ని అవతలి వ్యక్తికి చెప్పాలి. నువ్వు మంచివాడివి, కానీ పట్టనట్లు నిర్లక్ష్యంగా ఉండే ఈ పద్ధతి మన బంధాన్ని చంపేస్తోందని కఠినంగా చెప్పాలి. నిజానికి ప్రేమ(Love) అంటే కేవలం బతిమాలడం కాదు, గొడవ జరిగినప్పుడు అహాన్ని పక్కన పెట్టి అవతలి వ్యక్తిని కౌగిలించుకోవడం. ఆ మార్పు అతనిలో రానంత కాలం, మీ మధ్య జరిగే ఈ నిశ్శబ్ద యుద్ధం..మీ ఇద్దరి బంధాన్ని లోలోపల దహించివేస్తూనే ఉంటుంది.




