MI vs RCB : రాయ్ పూర్ లో హైవోల్టేజ్ ఫైట్..ముంబైతో తలపడనున్న ఆర్సీబీ
MI vs RCB : 10 మ్యాచ్ లు ఆడిన ముంబై 3 విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం సాంకేతికంగా మాత్రమే ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలిచింది
MI vs RCB
ఐపీఎల్ 19వ సీజన్ లో ఆదివారం హైవోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్(MI vs RCB) తో తలపడనుంది. రాయ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్(MI vs RCB) కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై గా చెప్పాలి.
దీనిలో ఓడితే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లు ఆడిన ముంబై 3 విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం సాంకేతికంగా మాత్రమే ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లూ గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో రన్ రేట్ మెరుగుపరుచుకోవడంతో పాటు మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసొస్తేనే ప్లే ఆఫ్ కు చేరుతుంది.
ఒకవేళ ఆదివారం మ్యాచ్ లో ఓడితే ఈ సీజన్ లో ముంబై(MI vs RCB) కథ ముగిసినట్టే. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై భారీస్కోరును ఛేజ్ చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ, రికెల్టన్ ఫామ్ లో ఉండగా.. సూర్యు కుమార్ నిరాశపరుస్తున్నాడు. ఈ సీజన్ లో ఒక్క చెప్పుకోదగిన ఇన్నింగ్స్ కూడా అతను ఆడలేదు. హార్దిక్ పాండ్యాది కూడా ఇదే పరిస్థితి.
గాయంతో గత మ్యాచ్ కు దూరమైన పాండ్యా ఆర్సీబీపై బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఆడతాడో లేదో అన్న అనుమానాలు వచ్చినా పాండ్యా జట్టుతో చేరడంతో సస్పెన్స్ కు తెరపడింది. బ్యాటింగ్ లో నమన్ ధీర్, విల్ జాక్స్ , తిలక్ వర్మ కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. అటు బౌలింగ్ లో బుమ్రా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు.
కానీ ఈ స్టార్ పేసర్ భారీగా పరుగులిచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. శార్థూల్ ఠాకూర్ , బౌల్ట్ , ఘజన్ ఫర్ వంటి వారితో బౌలింగ్ కూడా బాగానే ఉన్నా నిలకడలేమి ఇబ్బందిగా మారింది. బౌలర్లు సమిష్టిగా రాణించకుంటే మాత్రం ముంబై ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒత్తిడిలో పడినట్టు కనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోవడం ఆ జట్టుకు మింగుడుపడడం లేదు. గుజరాత్ పైనా తర్వాత లక్నో చేతిలోనూ ఊహించని విధంగా పరాభవాలు ఎదుర్కొంది. ప్రస్తుతం 10 మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్ లో ఉన్న ఆర్సీబీ ముంబైని ఓడించి ప్లే ఆఫ్ రేసులో ముందంజ వేయాలని భావిస్తోంది.

గత మ్యాచ్ లో ఓపెనర్లు బెథెల్, కోహ్లీ వైఫల్యం కొంపముంచింది. పటిదార్, పడిక్కల్ , టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించినా భారీ టార్గెట్ ను ఛేదించలేకపోయింది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిస్తే ఆర్సీబీ ఎలాంటి లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది. అటు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ , హ్యాజిల్ వుడ్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా భువీ వయసు మీద పడినా తనదైన పేస్ బౌలింగ్ తో సత్తా చాటుతున్నాడు.
అటు కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ కూడా రాణిస్తుండడంతో బౌలింగ్ పరంగా బెంగళూరుకు బెంగ లేదు. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 35 మ్యాచ్ లలో తలపడితే ముంబై 19 సార్లు గెలిచింది. ఆర్సీబీ 16 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక రాయ్ పూర్ పిచ్ బాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా.
Rashid Khan : తిప్పేసిన రషీద్ ఖాన్..గుజరాత్ చేతిలో రాజస్థాన్ చిత్తు





