Decision :చిన్న చిన్న నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటే నష్టమా? .. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?
Decision :రోజంతా ఆఫీస్ పనులతో అలసిపోయి ఇంటికి వచ్చాక రాత్రి పూట ఆరోగ్యకరమైన వంట వండుకునే నిర్ణయాన్ని తీసుకోలేక, చాలా ఈజీగా దొరికే జంక్ ఫుడ్‌ను ఆర్డర్ చేసేసుకుంటారు.
Decision
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. అంతెందుకు ఉదయం ఏ బట్టలు వేసుకోవాలి, టిఫిన్ ఏం తినాలి అనే విషయాల నుంచి ఆఫీసులో ఎలాంటి పనులు పూర్తి చేయాలనే వాటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
అయితే, ఇలా ఎక్కువ నిర్ణయాల(Decision )ను తీసుకోవడం వల్ల రోజు ముగిసే సమయానికి మైండ్ ఎక్కువ అలసటకు లోనవుతుంది. దీనినే సైకాలజీలో డెసిషన్ ఫెటీగ్ (Decision Fatigue) అని పిలుస్తారు. ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడైనా సరే, నిరంతరం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక దశ దాటాక వారి ఆలోచనా శక్తి మందగించి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుందని సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైకాలజీ ప్రకారం, ఈ నిర్ణయాలతో అలసిపోవడం వల్ల మనుషులలో రెండు రకాల ప్రవర్తనలు కనిపిస్తాయి. మొదటిది, తీవ్రమైన అలసట వల్ల ఏ నిర్ణయం కూడా తీసుకోలేక పనులను వాయిదా వేయడం (Procrastination). రెండోది, ఎక్కువ ఆలోచించే ఓపిక లేక కళ్లముందు ఉన్న అత్యంత ఈజీ నిర్ణయాన్ని తీసుకోవడం లేదా తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం.
దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకుంటే.. రోజంతా ఆఫీస్ పనులతో అలసిపోయి ఇంటికి వచ్చాక రాత్రి పూట ఆరోగ్యకరమైన వంట వండుకునే నిర్ణయాన్ని(Decision) తీసుకోలేక, చాలా ఈజీగా దొరికే జంక్ ఫుడ్‌ను ఆర్డర్ చేసేసుకుంటారు. అలాగే, షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ కౌంటర్ల దగ్గర చాక్లెట్లు, చిన్న చిన్న వస్తువులు పెట్టడం వెనుక కూడా ఈ సైకాలజీనే వాడతారు వ్యాపారవేత్తలు. కస్టమర్లు వస్తువులు ఎంచుకుని అలసిపోయాక, చివరి నిమిషంలో ఆలోచించకుండా వాటిని కొనేస్తారని ఈ ట్రిక్ ఉపయోగిస్తారు.
ఈ మానసిక అలసట నుంచి మన మెదడును కాపాడుకోవడానికి సైకాలజీ కొన్ని అద్భుతమైన మార్గాలను సూచిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలైన స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు ఎప్పుడూ ఒకే రకమైన బట్టలు ధరించడం వెనుక ఉన్న అసలు రహస్యం కూడా ఇదే.

ఉదయాన్నే డ్రెస్సుల సెలక్షన్ కోసం మైండ్ పవర్‌ను వృధా చేయకుండా, ఆ ఎనర్జీని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాల కోసం వారు దాచుకుంటారు. ఇలా మనం కూడా మన డైలీ లైఫ్‌లో మరుసటి రోజు చేయాల్సిన పనులను, తినాల్సిన ఆహారాన్ని ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకోవడం ద్వారా ఈ నిర్ణయాల అలసటను తగ్గించొచ్చు.
అందుకే ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ డెసిషన్స్ ఎప్పుడూ కూడా ఉదయం పూట మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడే తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా, మన నిర్ణయాల కచ్చితత్వం కూడా పెరుగుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
Prince Yadav : ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ కు పిలుపు..ఆప్ఘన్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే





