CSK vs GT : టాప్-2లో ముగిస్తుందా ?..చెన్నైతో గుజరాత్ పోరు
CSK vs GT : గుజరాత్ టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది తమ హోంగ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది
CSK vs GT
ఐపీఎల్ 19వ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. గురువారం తమ హోంగ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(CSK vs GT) తో తలపడబోతోంది. టాప్ 2లో లీగ్ స్టేజ్ ను ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే 18 పాయింట్లు సాధిస్తుంది.
ప్రస్తుతం 13 మ్యాచ్ లలో 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఓడితే మాత్రం టాప్-2 నుంచి కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే టాప్ 2లో నిలిస్తే తొలి క్వాలిఫైయర్ లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి ఒకవిధంగా గుజరాత్ కు షాకే. వరుసగా ఐదు విజయాల తర్వాత అనూహ్యంగా ఓడిపోయింది.
248 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు పోరాడినా కీలక బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది. ఓవరాల్ గా ఈ సీజన్ లో గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. టాప్ 5లో ఉన్న వీరిద్దరూ గుజరాత్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో బట్లర్, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపిస్తున్నారు. అటు బౌలింగ్ లో సిరాజ్ , రబాడతో పాటు జాసన్ హోల్డర్ అదరగొడుతున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం ఫామ్ లోకి రావడంతో గుజరాత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా ఇది చివరి మ్యాచ్ . గత మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు గుజరాత్ పై గెలవాల్సిందే. అప్పుడు కూడా ప్లే ఆఫ్ చేరుతుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే చెన్నైకి మిగిలిన జట్ల మ్యాచ్ ల ఫలితాలు కూడా కలిసిరావాలి.

మొదట గుజరాత్ పై భారీ విజయం సాధిస్తే 14 పాయింట్లతో రన్ రేట్ కూడా మెరుగవుతుంది. తర్వాత పంజాబ్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో చేతిలో ఓడిపోవాలి. అలాగే రాజస్థాన్, కేకేఆర్ తలో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, ఢిల్లీ ఒక మ్యాచ్ ఆడనుంది. ఈ మూడు జట్లు ఆడే ప్రతి మ్యాచ్ లోనూ ఓడిపోవాలి.
అదే సమయంలో 14 పాయింట్లు సమమైతే మాత్రం రన్ రేట్ కీలకమవుతుంది. కాగా గత మ్యాచ్ లో సంజూతో సహా కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్ లో చెన్నై బ్యాటింగ్ లో అదరగొట్టకుంటే మాత్రం విజయం అందడం కష్టమే. బౌలింగ్ లో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ సత్తా చాటుతుంటే అన్షుల్ కాంబోజ్ భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్, అకిల్ హొస్సేన్ మాత్రం తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. గత రికార్డుల్లో గుజరాత్(CSK vs GT) దే పైచేయిగా ఉంది. అహ్మదబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.
Marriage:పెళ్లి వద్దంటున్న నేటి తరం.. వీరి మైండ్ సెట్ ఎందుకిలా మారుతుంది?





