RCB vs GT : తొలి అడుగు ఎవరిదో ?..ఆర్సీబీతో గుజరాత్ ఢీ
RCB vs GT : మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 1లో తలపడబోతున్నాయి
RCB vs GT
ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్స్ స్టేజ్ కు చేరింది. లీగ్ స్టేజ్ ముగియడంతో నాలుగు జట్లు ముందంజ వేయగా ఇక ప్లే ఆఫ్స్ సమరాలు అభిమానులు అలరించబోతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్(RCB vs GT) క్వాలిఫైయర్ 1లో తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
బలాబలాల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్ లో ఆర్సీబీ(RCB vs GT) అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. లీగ్ స్టేజ్ ను అగ్రస్థానంతో ముగించింది. 14 మ్యాచ్ లలో 9 విజయాలు సాధించిన ఆర్సీబీ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ లో బెంగళూరుకు బ్యాటింగ్ లో కోహ్లీ, పడిక్కల్, పటిదార్ , టిమ్ డేవిడ్ ఈ నలుగురు రాణిస్తుండడం బలంగా చెప్పొచ్చు.
అయితే ఫిల్ సాల్ట్ క్వాలిఫైయర్ 1లో ఆడతాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. గాయంతో స్వదేశానికి వెళ్లి మళ్లీ తిరిగొచ్చిన సాల్ట్ ఆడకుంటే వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయి. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ పై వెంకటేశ్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ లో భారీ టార్గెట్ ను ఛేదించలేక ఓడిపోయిన ఆర్సీబీని తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. బ్యాటింగ్ పరంగా కీలక ఆటగాళ్లు ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు అడ్వాంటేజ్.
టిమ్ డేవిడ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశముంది. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్ వుడ్ పేస్ విభాగానికి కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ తన పేస్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ వెటరన్ పేసర్ నిలకడగా రాణిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యువ పేసర్ రసిక్ సలామ్ దార్ కూడా సత్తా చాటుతున్నాడు. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యాతో పాటు సుయాశ్ శర్మపై అంచనాలున్నాయి. కృనాల్ పాండ్యా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. వీరు సమిష్టిగా చెలరేగితే ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
మరోవైపు గుజరాత్(RCB vs GT) కూడా ఈ సీజన్ లో అదరగొడుతోంది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడినా సెకండాఫ్ లో అద్భుతంగా పుంజుకుంది. వరుస విజయాలతో టాప్ 2లో నిలిచింది. ఆర్సీబీ తరహాలోనే లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లు గెలిచింది. చివరి ఏడు మ్యాచ్ లలో ఆరింట గెలిచిందంటే ఆ జట్టు ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ బ్యాటింగ్‌లో ఎక్కువగా శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌పై ఆధారపడుతోంది. వన్ డౌన్ లో బట్లర్ కూడా రాణిస్తున్నాడు. అయితే మిగిలిన బ్యాటర్లు కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడితే భారీస్కోరు ఖాయం. ఒకవేళ టాపార్డర్ తడబడితే మాత్రం గుజరాత్ కు కష్టాలు తప్పవు. గుజరాత్ పరాజయం పాలైన మ్యాచ్ లలో ఇది స్పష్టంగా కనిపించింది.

అటు బౌలింగ్ కు సంబంధించి పేసర్లు కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా రబాడ ఫామ్ అందుకోగా.. సిరాజ్ కూడా కీలక వికెట్లు తీస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ లాంటి మ్యాచ్ విన్నర్ గుజరాత్ కు ప్రధాన బలంగా చెప్పొచ్చు. ప్రసిద్ధ కృష్ణను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపే ఛాన్సుంది.
కాగా ప్రస్తుత సీజన్ లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. హోం గ్రౌండ్ ఎవరిదైతే ఆ జట్టు మాత్రమే గెలిచింది. ఓవరాల్ గా ఇరు జట్లు 8 మ్యాచ్ లలో తలపడితే సగం సగం గెలిచాయి. ఇక ధర్మశాల పిచ్ విషయానికొస్తే బ్యాటింగ్ కే అనుకూలం. ఇక్కడ సగటు స్కోరు 210 పైన నమోదవుతుండడంతో మరో హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయం.
Karnataka : కర్ణాటకలో మళ్లీ మొదలైన సీఎం సీటు లొల్లి..ఢిల్లీకి సిద్ధరామయ్య ..డీకేకు అందని ఆహ్వానం





